NZ All Out: వాషింగ్టన్ సుందర్ దెబ్బకి పుణెలో కివీస్ 259కే కుదేల్, రోహిత్ డకౌట్‌తో ఈరోజు ఆటని ముగించిన భారత్
24 October 2024, 16:57 IST
India vs New Zealand 2nd Test: 2021లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్.. ఈరోజు పుణె టెస్టుతో భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతని దెబ్బకి కివీస్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు.
న్యూజిలాండ్ 259కి ఆలౌట్
పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ దెబ్బకి న్యూజిలాండ్ టీమ్ 259 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. మూడేళ్ల తర్వాత భారత్ టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సుందర్ ఈరోజు తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు వేసి కేవలం 59 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఇద్దరు బౌలర్ల దెబ్బకే న్యూజిలాండ్ టీమ్ మొత్తం 79.1 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌటైంది.
రోహిత్ డకౌట్
న్యూజిలాండ్ ఆలౌట్ తర్వాత ఆఖరి సెషన్‌లో మొదటి ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి 16/1తో నిలిచింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (6 బ్యాటింగ్), శుభమన్ గిల్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు.
సుందర్‌కి బ్యాక్ టు బ్యాక్ వికెట్లు
ఈరోజు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్‌లో ఓపెనర్ దేవాన్ కాన్వె (76), రచిన్ రవీంద్ర (65) హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. దేవాన్ కాన్వె (15), విల్ యంగ్ (18)తో పాటు దేవాన్ కాన్వె (76)ని అశ్విన్ ఔట్ చేయగా.. మిగిలిన బ్యాటర్లందరినీ వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో వాషింగ్టన్ సుందర్ వికెట్లు పడగొట్టడంతో.. న్యూజిలాండ్ టీమ్‌లో ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
కుల్దీప్ స్థానంలో వచ్చి 7 వికెట్లు
వాషింగ్టన్ సుందర్ దెబ్బకి వరుసగా రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్ (18), టామ్ బ్లండెల్ (3), గ్లెన్ ఫిలిప్స్ (9), మిచెల్ శాంట్నర్ (33), టిమ్ సౌథీ (5), అజాజ్ పటేల్ (4) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. విలియమ్ ఓరోర్కీ (0 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టి మరీ వాషింగ్టన్ సుందర్‌కి రోహిత్ శర్మ ఛాన్స్ ఇవ్వగా.. అవకాశాన్ని రెండుజేతులా ఈ భారత స్పిన్నర్ వినియోగించుకున్నాడు.
పిచ్ స్పిన్నర్లకి అనుకూలించడంతో ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రాతో 8 ఓవర్లు, ఆకాశ్ దీప్‌తో 6 ఓవర్లని మాత్రమే రోహిత్ శర్మ బౌలింగ్ చేయించాడు. ఇక రవీంద్ర జడేజా 18 ఓవర్లు వేసినా.. కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
టాపిక్