Kuldeep Yadav Record: చరిత్ర సృష్టించిన కుల్దీప్‌ యాదవ్‌.. అశ్విన్‌, కుంబ్లేల రికార్డు బ్రేక్‌-kuldeep yadav record as he registered best bowling figures in bangladesh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Kuldeep Yadav Record As He Registered Best Bowling Figures In Bangladesh

Kuldeep Yadav Record: చరిత్ర సృష్టించిన కుల్దీప్‌ యాదవ్‌.. అశ్విన్‌, కుంబ్లేల రికార్డు బ్రేక్‌

Hari Prasad S HT Telugu
Dec 16, 2022 11:05 AM IST

Kuldeep Yadav Record: చరిత్ర సృష్టించాడు కుల్దీప్‌ యాదవ్‌. అతడు టీమిండియా సీనియర్‌ స్పిన్నర్లు అశ్విన్‌, కుంబ్లేల రికార్డు బ్రేక్‌ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌ ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

ఐదు వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్
ఐదు వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్ (Twitter/@debasissen)

Kuldeep Yadav Record: టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సుమారు 22 నెలల తర్వాత మరోసారి ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. కానీ వచ్చీ రాగానే తనదైన స్టైల్లో చెలరేగాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌ గడ్డపై అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన ఇండియన్‌ స్పిన్నర్‌గా కుల్దీప్‌ నిలిచాడు.

ఈ క్రమంలో టీమిండియా లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే, ఇప్పుడు టీమ్‌లో ఉన్న సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ల రికార్డును బ్రేక్‌ చేశాడు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 రన్స్‌కే ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. ఇందులో కుల్దీప్‌ 40 రన్స్‌ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఇవి ఓ ఇండియన్‌ స్పిన్నర్‌ బంగ్లాదేశ్‌ గడ్డపై నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు.

ఈ మ్యాచ్‌లో అంతకుముందు కుల్దీప్‌ బ్యాట్‌తోనూ రాణించి 40 రన్స్‌ చేశాడు. టీమిండియా స్కోరు 400 దాటడంలో అతనిది కూడా కీలకపాత్రే. ఇక టెస్టుల్లో కుల్దీప్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది మూడోసారి. ఆస్ట్రేలియాలో ఒకసారి, ఇండియాలో వెస్టిండీస్‌పై మరోసారి ఐదేసి వికెట్లు తీసుకున్నాడు. అయితే కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన మాత్రం ఇప్పుడు బంగ్లాదేశ్‌పై చేసినదే.

ఇప్పటి వరకూ బంగ్లాదేశ్‌ గడ్డపై బెస్ట్‌ ఫిగర్స్‌ అశ్విన్‌ పేరిట ఉండేది. అతడు 2015లో 87 రన్స్‌ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు 2004లో అనిల్‌ కుంబ్లే 55 రన్స్‌కు 4 వికెట్లు తీశాడు. ఆ రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేయగా.. అశ్విన్‌ రికార్డును ఇప్పుడు కుల్దీప్‌ బ్రేక్‌ చేశాడు. ఇక ఓవరాల్‌గా బంగ్లాదేశ్‌లో ఓ ఇండియన్‌ బౌలర్‌ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాల రికార్డు జహీర్‌ ఖాన్‌ పేరుతో ఉంది. అతడు 2007లో 87 రన్స్‌ ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ రెండో రోజు కుల్దీప్‌ 4 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. రెండో రోజు అతడు మరో వికెట్‌ తీశాడు. మరోవైపు సిరాజ్‌ కూడా 3 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్‌ కేవలం 150 రన్స్‌కే ఆలౌటైంది.

WhatsApp channel