Team India Coach: జింబాబ్వే టూర్‌కు టీమిండియా కోచ్‌గా లక్ష్మణ్ - గంభీర్ బాధ్యతలు స్వీకరించేది ఎప్పుడంటే?
21 June 2024, 9:38 IST
Team India Coach: జింబాబ్వే టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూలైలో శ్రీలంకతో మొదలుకానున్న టోర్నీ నుంచే గంభీర్ కోచ్ పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
వీవీఎస్ లక్ష్మణ్
Team India Coach: టీమిండియా హెడ్ కోచ్ నియామక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. గంభీర్ హెడ్ కోచ్‌గా ఎంపికైనట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అతడు మరో నెల వరకు బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. దాంతో జింబాబ్వే పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తించబోతున్నట్లు సమాచారం.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్...
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా... జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్‌తో ప్రస్తుతం టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనుంది. వరల్డ్ కప్ ముగియగానే ద్రావిడ్ ఇండియాకు రానున్నాడు.
ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్ జింబాబ్వే టూర్‌కు హెడ్ కోచ్ బాధ్యతలను నిర్వర్తించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడెమీకి (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు. గతంలో టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించాడు. గత ఏడాది ఐర్లాండ్ టూర్‌కు ద్రావిడ్ అందుబాటులో లేకపోవడంతో అతడి బదులుగా కోచ్‌గా పనిచేశాడు.
సీనియర్లకు విశ్రాంతి...
జూలై 6 నుంచి 14 వరకు టీమిండియా, జింబాబ్వే టీ20 సిరీస్ జరగనుంది. జింబాబ్వే సిరీస్ కోసం వరల్డ్ కప్ ఆడుతోన్న సీనియర్ ప్లేయర్లు అందరికి బీవీసీఐ విశ్రాంతి కల్పించనుంది. ఐపీఎల్‌లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును జింబాబ్వే టూర్‌కు పంపించబోతున్నారు. ఈ వారంలోనే జింబాబ్వే టూర్ కోసం ఇండియన్ టీమ్‌ను సెలెక్టర్లు ప్రకటించబోతున్నారు.ఈ టీ20 సిరీస్ కోసం అభిషేక్ శర్మ, నితీష్ కుమార్, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్‌తో పాటు మరికొందరు యంగ్ ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి.
గంభీర్ బాధ్యతలు స్వీకరించేది ఎప్పుడంటే?
టీ20 వరల్డ్ కప్‌తో టీమిండియా కోచ్‌గా ద్రావిడ్ పదవీకాలం ముగిస్తోంది. హెడ్ కోచ్‌గా ద్రావిడ్‌నే కొనసాగించాలని బీసీసీఐ భావించింది. కానీ ద్రావిడ్ అందుకు సుముఖంగా లేకపోవడంతో అతడి స్థానంలో గంభీర్‌ను కోచ్‌గా నియమించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూలైలోనే శ్రీలంకతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 27 నుంచి శ్రీలంక టూర్ మొదలుకానుంది. ఈ టోర్నీ నుంచే టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒక్క ఓటమి లేకుండా...
మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా అదరగొడుతోంది. ఒక్క ఓటమి లేకుండా దూసుకుపోతుంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచింది టీమిండియా. సూపర్ 8లో ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 47 పరుగులతో విజయాన్ని సాధించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్‌లో బుమ్రా, అర్షదీప్ సింగ్ రాణించి టీమిండియాకు విజయాన్ని అందించారు. వరల్డ్ కప్ గెలిచిన ద్రావిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా క్రికెటర్లు భావిస్తోన్నారు.