India vs South Africa: రేపటి నుంచే భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. షెడ్యూల్, టైమింగ్స్, లైవ్ వివరాలివే
India vs South Africa T20 Series: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ రేపు (డిసెంబర్ 10) మొదలుకానుంది. ఈ సిరీస్‍లో మ్యాచ్‍ల షెడ్యూల్, టైమింగ్స్, లైవ్ వివరాలను ఇక్కడ చూడండి.

India vs South Africa T20 Series: దక్షిణాఫ్రికా గడ్డపై పోరును ఆరంభించేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ పర్యటనలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20ల సిరీస్ రేపు (డిసెంబర్ 10) మొదలుకానుంది. దర్బన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 రేపు జరగనుంది. ఈ మ్యాచ్‍తోనే సౌతాఫ్రికా టూర్‌ను భారత్ మొదలుపెట్టనుంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. మంచి ఫామ్‍లో ఉంది. దక్షిణాఫ్రికాతో టీ20లకు కూడా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో భారత్‍కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు. టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ వివరాలివే..
IND vs SA టీ20 సిరీస్ మ్యాచ్ డేట్లు, టైమింగ్స్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‍లో తొలి మ్యాచ్ రేపు (డిసెంబర్ 10) జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
- భారత్, దక్షిణాఫ్రికా మొదటి టీ20 - డిసెంబర్ 10 - సాయంత్రం 7.30 గంటల నుంచి - డర్బన్
- రెండో టీ20 - డిసెంబర్ 12 - రాత్రి 8.30 గంటల నుంచి - కెబెర్హా
- మూడో టీ20 - డిసెంబర్ 14 - రాత్రి 8.30 గంటల నుంచి - జొహెన్నెస్‍బర్గ్
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లైవ్ వివరాలు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ మ్యాచ్‍లు స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తొలి టీ20 రేపు (డిసెంబర్ 10) సాయంత్రం 7.30 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 7 గంటలకు టాస్ పడనుంది. దర్బన్‍లోని కింగ్స్ మేడ్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
తొలి టీ20కి తుది జట్లు ఇలా..
భారత్ తుది జట్టు (అంచనా): శుభ్‍మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్/ ముకేశ్ కుమార్, మహమ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా తుది జట్టు (అంచనా): రీజా హెండ్రిక్స్, త్రిస్టన్ స్టబ్స్, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, అండ్లీ ఫెలుక్వాయో, మార్కో జాన్సెన్, గెరెల్ కోట్జీ, కేశవ్ మహారాజ్, లిజాడ్ విలియమ్స్, తబ్రైజ్ షంసీ
దక్షిణాఫ్రికా పర్యటనలో ఈ మూడు టీ20ల సిరీస్ తర్వాత మూడు వన్డేలు (డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 21 మధ్య), రెండు టెస్టుల సిరీస్(డిసెంబర్ 26 నుంచి - 2024 జనవరి 7 వరకు)లను టీమిండియా ఆడనుంది. వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నారు.