India vs Afghanistan T20 World Cup: చుక్కలు చూపించిన బుమ్రా.. ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా-india vs afghanistan t20 world cup bumrah takes team india home convincingly in first super 8 match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Afghanistan T20 World Cup: చుక్కలు చూపించిన బుమ్రా.. ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా

India vs Afghanistan T20 World Cup: చుక్కలు చూపించిన బుమ్రా.. ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా

Hari Prasad S HT Telugu
Jun 20, 2024 11:41 PM IST

India vs Afghanistan T20 World Cup: బుమ్రా చుక్కలు చూపించడంతో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ తొలి సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బుమ్రాతోపాటు కుల్దీప్, అక్షర్ పటేల్, జడేజా కూడా రాణించారు.

చుక్కలు చూపించిన బుమ్రా.. ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
చుక్కలు చూపించిన బుమ్రా.. ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా (PTI)

India vs Afghanistan T20 World Cup: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ 1 తొలి సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సూర్యకుమార్ మెరుపులు.. బుమ్రా చుక్కలు చూపించడంతో ఇండియన్ టీమ్ సులువుగా గెలిచింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ టీమ్ 20 ఓవర్లలో 134 రన్స్ కు ఆలౌటైంది. బుమ్రా, అర్ష్‌దీప్ చెరో మూడు వికెట్లు తీయడంతో ఇండియా 47 పరుగులతో గెలిచింది.

ఆఫ్ఘన్‌కు బుమ్రా పంచ్

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బౌలింగ్ కు తురుపు ముక్కగా ఉన్న బుమ్రా.. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లోనూ అదే స్థాయిలో రాణించాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. పరుగులు పొదుపుగా ఇవ్వడంతోపాటు వికెట్లు కూడా తీయడంతో ఆఫ్ఘన్ టీమ్ ఏ దశలోనూ లక్ష్యం వైపు వెళ్తున్నట్లు కనిపించలేదు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం విశేషం.

అటు అర్ష్‌దీప్ కూడా 3 వికెట్లు తీయగా.. కుల్దీప్ కు రెండు వికెట్లు పడ్డాయి. ఆఫ్ఘన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రమే 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నజీబుల్లా జద్రాన్ 19, గుల్బదీన్ నాయిబ్ 17 రన్స్ చేశారు. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ 1లో తొలి స్థానంలో నిలిచింది. గ్రూప్ 1లో రెండో సూపర్ 8 మ్యాచ్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది.

సూర్య మెరుపులతోె..

సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీతో ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 రన్స్ చేసింది. సూర్య హాఫ్ సెంచరీ చేయగా.. హార్దిక్ పాండ్యా 32 పరుగులతో రాణించాడు. కోహ్లి, రోహిత్ మరోసారి నిరాశపరిచారు. చివరి ఓవర్లో అక్షర్ పటేల్ రెండు బౌండరీలు బాదాడు.

టాపార్డర్ లో రోహిత్, కోహ్లి, రిషబ్ పంత్ విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు. తనదైన స్టైల్లో గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ ఆఫ్ఘన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అతడు కేవలం 28 బంతుల్లో 53 రన్స్ చేశాడు. సూర్య ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. అతడు కొట్టిన మూడు సిక్స్ లు భారీవే కావడం విశేషం.

90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్య ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు మంచి స్కోరు అందించింది. అయితే అతడు 17వ ఓవర్ చివరి బంతికి ఔటవడంతో మరింత భారీ స్కోరు చేసే అవకాశం కోల్పోయింది. మరోవైపు హార్దిక్ కూడా ఫర్వాలేదనిపించాడు. పాండ్యా 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 32 రన్స్ చేశాడు. కానీ అతడు కూడా 18వ ఓవర్లోపే ఔటయ్యాడు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇండియన్ టీమ్ ఊహించిన స్కోరు సాధించలేకపోయింది.

కోహ్లి, రోహిత్ మళ్లీ విఫలం

టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లోనూ రోహిత్ తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేశాడు. ఈ మెగా టోర్నీలో లీగ్ స్టేజ్ లో ఇదే స్థానంలో వచ్చి మూడు మ్యాచ్ లలో కేవలం 5 రన్స్ చేసిన విరాట్.. ఈ మ్యాచ్ లో కాస్త ఊపు మీదున్నట్లు కనిపించినా.. 24 బంతుల్లో 24 రన్స్ చేసి ఔటయ్యాడు.

అటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లెఫ్టామ్ పేసర్ ఫజల్ హక్ ఫరూకీ బౌలింగ్ లో ఇబ్బంది పడుతూ 13 బంతుల్లో 8 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మూడో స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ కూడా నిరాశ పరిచాడు. 11 బంతుల్లో 20 రన్స్ చేశాడు.

Whats_app_banner