Team India Home Schedule: స్వదేశంలో టీమిండియా షెడ్యూల్ రిలీజ్.. ఆ మూడు టీమ్స్‌తో కీలకమైన సిరీస్‌లు.. హైదరాబాద్‌లో టీ20
Team India Home Schedule: స్వదేశంలో 2024-25 సీజన్ లో టీమిండియా ఆడబోయే పూర్తి షెడ్యూల్ ను గురువారం (జూన్ 20) రిలీజ్ చేసింది బీసీసీఐ. మూడు జట్లతో ఈ హోమ్ సీజన్ సాగనుంది.
Team India Home Schedule: టీమిండియా కొత్త సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఇందులో భాగంగా స్వదేశంలో రోహిత్ సేన ఆడబోయే సిరీస్ ల షెడ్యూల్ ను గురవారం (జూన్ 20) రిలీజ్ చేసింది. ఈ హోమ్ సీజన్ లో భాగంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ టీమ్స్ తో ఇండియన్ టీమ్ సిరీస్ లు ఆడనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఇండియా హోమ్ సీజన్ ప్రారంభం కానుంది.
టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ఇదే
టీమిండియా మెన్స్ టీమ్ హోమ్ సీజన్ షెడ్యూల్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ సీజన్ లో మూడు టీమ్స్ ఇండియాకు వచ్చి టెస్టు, టీ20, వన్డే సిరీస్ లు ఆడనున్నాయి. మొదట బంగ్లాదేశ్ రానుండగా.. తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్ వస్తాయి. సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.
ఇక ఆ తర్వాత అక్టోబర్ లో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్ కోసం ఇండియాకు రానుంది. ఈ సిరీస్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. ఇక వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో ఇంగ్లండ్ టీమ్ ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడటానికి రాబోతోంది. ఈ మూడు సిరీస్ ల పూర్తి షెడ్యూల్ ను కూడా బీసీసీఐ రిలీజ్ చేసింది.
బంగ్లాదేశ్‌తో సిరీస్.. హైదరాబాద్‌లో టీ20 మ్యాచ్
బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ 19న జరగబోయే తొలి టెస్టుతో టీమిండియా హోమ్ సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ టెస్టు చెన్నైలో సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు జరగనుంది. ఇక రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్ కు కాన్పూర్ వేదిక కానుంది.
బంగ్లాదేశ్ తో మూడు టీ20ల సిరీస్ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 6న ధర్మశాలలో తొలి టీ20 జరుగుతుంది. తర్వాత అక్టోబర్ 9న ఢిల్లీలో రెండో టీ20.. అక్టోబర్ 12న హైదరాబాద్ లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతాయి. దీంతో బంగ్లాదేశ్ సిరీస్ ముగుస్తుంది.
న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్
బంగ్లాదేశ్ టీమ్ వెళ్లిపోగానే.. ఇండియాకు న్యూజిలాండ్ టీమ్ రానుంది. ఈ టీమ్ మన దగ్గర మూడు టెస్టులు ఆడుతుంది. తొలి టెస్టు అక్టోబర్ 16న బెంగళూరులో ప్రారంభమవుతుంది.
ఇక రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి 28 వరకు పుణెలో జరుగుతుంది. మూడో టెస్టు నవంబర్ 1 నుంచి 5 వరకు ముంబైలో జరగనుంది. న్యూజిలాండ్ తో కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే ఉంది. వన్డే, టీ20 సిరీస్ లు లేవు.
వచ్చే ఏడాది రానున్న ఇంగ్లండ్
న్యూజిలాండ్ తో సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ టీమ్ ఇండియాకు రానుంది. ఆ టీమ్ టీమిండియాతో.. ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. మొదట ఐదు టీ20ల సిరీస్ జరుగుతుంది.
తొలి టీ20 వచ్చే ఏడాది జనవరి 22న చెన్నైలో, రెండో టీ20 జనవరి 25న కోల్‌కతాలో, మూడో టీ20 జనవరి 28న రాజ్‌కోట్ లో, నాలుగో టీ20 జనవరి 31న పుణెలో, ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతాయి. ఇక మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్‌పూర్ లో, రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్ లో, మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ లో జరుగుతాయి. దీంతో 2024-25 హోమ్ సీజన్ ముగుస్తుంది.