Ban vs Nep: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్.. నేపాల్‌పై ఘన విజయం-bangladesh storms into t20 world cup super 8 stage beats nepal in their final league match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ban Vs Nep: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్.. నేపాల్‌పై ఘన విజయం

Ban vs Nep: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్.. నేపాల్‌పై ఘన విజయం

Hari Prasad S HT Telugu
Jun 17, 2024 08:45 AM IST

Ban vs Nep: టీ20 వరల్డ్ కప్ లో చివరి సూపర్ 8 టీమ్ కూడా కన్ఫమ్ అయింది. సోమవారం (జూన్ 17) నేపాల్ పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ గ్రూప్ డి నుంచి రెండో జట్టుగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది.

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్.. నేపాల్‌పై ఘన విజయం
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్.. నేపాల్‌పై ఘన విజయం

Ban vs Nep: టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8లోకి అడుగుపెట్టింది బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్. ఈ చివరి బెర్తు కోసం నెదర్లాండ్స్ తో పోటీ పడిన బంగ్లా టీమ్.. తమ చివరి లీగ్ మ్యాచ్ లో నేపాల్ పై విజయం ద్వారా తమ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 21 పరుగులతో బంగ్లాదేశ్ గెలిచింది. 107 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక నేపాల్ కేవలం 85 పరుగులకే కుప్పకూలింది.

సూపర్ 8లోకి బంగ్లాదేశ్

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లోకి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో చివరి లీగ్ మ్యాచ్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తక్కువ స్కోరే చేసినా.. ఆ లక్ష్యాన్నీ కాపాడుకుంది. ఆ టీమ్ బౌలర్ తాంజిమ్ హసన్ సకీబ్ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడంతో నేపాల్ 107 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది.

సకీబ్ కు తోడు ముస్తఫిజుర్ రెహమాన్ 3, షకీబల్ హసన్ రెండు వికెట్లు తీయడంతో 19.2 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. మొదట్లోనే సకీబ్ ధాటికి ఒక దశలో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కుశల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ ఆరో వికెట్ కు 52 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ తమ జట్టును విజయం వైపు తీసుకెళ్లేలా కనిపించినా.. కీలక సమయంలో ఔటవడంతో ఆ జట్టు కుప్పకూలింది.

అంతకుముందు బంగ్లాదేశ్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. 19.3 ఓవర్లోల కేవలం 106 పరుగులే చేసింది. ఆ టీమ్ లో మాజీ కెప్టెన్ షకీబ్ చేసిన 17 పరుగులే అత్యధికం కావడం విశేషం. మహ్మదుల్లా 13, జాకెల్ అలీ 12, రిషాద్ హుస్సేన్ 13, తస్కిన్ అహ్మద్ 12 పరుగులు చేశారు. నేపాల్ బౌలరలలో సోంపాల్ కామి, దీపేంద్ర సింగ్ ఐరీ, రోహిత్ పౌదెల్, సందీప్ లామిచానె తలా రెండు వికెట్లతో రాణించారు.

బంగ్లాదేశ్ సూపర్ 8 షెడ్యూల్ ఇదే

టీ20 వరల్డ్ కప్ లో ఈ మ్యాచ్ కు ముందే సూపర్ 8లో ఏడు జట్లు ఖాయమయ్యాయి. గ్రూప్ ఎ నుంచి ఇండియా, యూఎస్ఏ.. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్.. గ్రూప్ డి నుంచి సౌతాఫ్రికా క్వాలిఫై అయ్యాయి. గ్రూప్ డి నుంచి మరో స్థానం కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీ పడినా.. చివరికి ఆ బెర్తు బంగ్లానే దక్కించుకుంది.

ఇప్పుడు సూపర్ 8లో ఆ టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ లతో కలిసి గ్రూప్ 1లో ఉండనుంది. సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్.. జూన్ 21న ఆస్ట్రేలియాతో, జూన్ 22న ఇండియాతో, జూన్ 25న ఆఫ్ఘనిస్థాన్ తో తలపడనుంది. సూపర్ 8 స్టేజ్ జూన్ 19 నుంచి జూన్ 25 వరకు సాగనుంది. ఈ స్టేజ్ నుంచి నాలుగు జట్లు సెమీఫైనల్లో అడుగుపెడతాయి.

Whats_app_banner