SA vs BAN T20 WC 2024: బంగ్లాదేశ్ కొంప ముంచి డెడ్‌బాల్.. ఆ 4 రన్స్ ఇచ్చి ఉంటే.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
SA vs BAN T20 WC 2024: డెడ్‌బాల్ నిబంధన సౌతాఫ్రికాతో మ్యాచ్ లో బంగ్లాదేశ్ కొంప ముంచింది. ఈ రూల్ వల్ల ఆ టీమ్ 4 పరుగులు నష్టపోగా.. సరిగ్గా అంతే తేడాతో బంగ్లా ఓడిపోవడం విశేషం.
SA vs BAN T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ లోని ఓ నిబంధనను మార్చాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. అది డెడ్‌బాల్ రూల్. దీనివల్ల ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీమ్ 4 పరుగులు నష్టపోగా.. చివరికి అన్నే పరుగుల తేడాతో ఆ టీమ్ ఓడిపోయింది. బంగ్లా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జరిగిన ఓ ఘటనపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం చర్చించుకుంటోంది.
బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందా?
114 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీమ్ చివరికి 10 ఓవర్లలో 7 వికెట్లకు 109 రన్స్ మాత్రమే చేసింది. అంటే 4 పరుగులతో ఓడిపోయింది. నిజానికి ఈ నాలుగు పరుగులే ఆ టీమ్ నుంచి లాక్కున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఆ టీమ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జరిగిన ఘటన దీనికి కారణమైంది. ఆ ఓవర్లో బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చాడు అంపైర్ సామ్ నోగాస్కి.
అయితే ఆ బాల్ అతని ప్యాడ్స్ ను తగిలి బౌండరీకి వెళ్లింది. మహ్మదుల్లా రివ్యూ తీసుకున్నాడు. అందులో అతడు నాటౌట్ అని తేలింది. దీంతో బంగ్లాదేశ్ కు ఆ 4 పరుగులు ఇవ్వాలి కదా అన్న ప్రశ్న తలెత్తింది. కానీ నిబంధనలు మాత్రం మరోలా ఉన్నాయి. దీంతో మహ్మదుల్లా తన వికెట్ కాపాడుకున్నా.. ఆ పోయిన పరుగులు మాత్రం సంపాదించలేకపోయాడు.
డెడ్‌బాల్ నిబంధనలు ఇవీ
క్రికెట్ లో ఉన్న డెడ్‌బాల్ నిబంధనల వల్ల బంగ్లాదేశ్ కు ఆ 4 పరుగులు ఇవ్వలేదు. మహ్మదుల్లా విషయంలో ఏం జరిగిందంటే.. బంతి అతని ప్యాడ్స్ ను తగిలి బౌండరీ లైన్ దాటేలోపు అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. దీంతో మూడో అంపైర్ ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తప్పని తేల్చినా.. రన్స్ మాత్రం రాలేదు. డెడ్‌బాల్ నిబంధనలు కూడా ఇదే చెబుతున్నాయి.
ఓ బ్యాటర్ ను ఆన్ ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినప్పుడు ఎలాంటి అదనపు పరుగులు (లెగ్ బైస్, బైస్) ఇవ్వకూడదు అన్నది డెడ్ బాల్ రూల్ చెబుతోంది. దీంతో మహ్మదుల్లా విషయంలోనూ అదే జరిగింది. ఒకవేళ ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించి, రివ్యూలోనూ అది నాటౌట్ గా తేలితే మాత్రం ఆ రన్స్ ఇస్తారు.
నిబంధనను తప్పుబట్టిన మాజీ క్రికెటర్లు
గవాస్కర్, వసీం జాఫర్ లాంటి టీమిండియా మాజీ క్రికెటర్లు ఈ నిబంధనను తప్పుబట్టారు. ప్రత్యర్థికి ఆ కీలకమైన పరుగులు ఇవ్వకుండా చేయడానికి ఈ నిబంధనను ఒక టీమ్ తమకు అనుకూలంగా మలచుకునే ప్రమాదం ఉందని గవాస్కర్ తన కాలమ్ లో రాశాడు. అటు వసీం జాఫర్ కూడా ఈ నిబంధనను తప్పుబడుతూ.. బంగ్లాదేశ్ టీమ్, అభిమానులకు తన సానుభూతి తెలిపాడు.
అటు కొందరు అభిమానులు కూడా ఇదేం రూల్ అంటూ తమ అసహనం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో మొదట సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 రన్స్ చేసింది. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 రన్స్ మాత్రమే చేసి నాలుగు పరుగులతో ఓడిపోయింది. వరుసగా మూడు విజయాలు సాధించిన సౌతాఫ్రికా సూపర్ 8కు దాదాపు చేరినట్లే.