SA vs BAN T20 World Cup 2024: మళ్లీ చుక్కలు చూపించిన న్యూయార్క్ పిచ్.. తక్కువ స్కోరుకే సౌతాఫ్రికా పరిమితం
SA vs BAN T20 World Cup 2024: న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియం పిచ్ మరోసారి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. దీంతో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
SA vs BAN T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో న్యూయార్క్ లో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 రన్స్ మాత్రమే చేసింది. బౌలర్లకు అనుకూలిస్తున్న ఇక్కడి పిచ్ పై మరోసారి బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. క్లాసెన్, మిల్లర్ కాస్త ప్రతిఘటించడంతో సఫారీలు ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తాంజిమ్ 3, తస్కిన్ 2 వికెట్లు తీశారు.
ఆదుకున్న క్లాసెన్, మిల్లర్
సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే దానికి కారణం ఇద్దరే. ఐపీఎల్లో టాప్ ఫామ్ లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ భాగస్వామ్యమే సఫారీలను కనీసం 100 స్కోరైనా దాటించింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 79 పరుగులు జోడించారు. 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును వీళ్లు ఆదుకున్నారు. తమ బౌలర్లకు కనీసం ఫైట్ చేసే అవకాశం ఇచ్చేలా స్కోరును 100 దాటించారు.
బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న పిచ్ పై క్లాసెన్ కూడా ఆచితూచి ఆడుతూ ఒక్కో పరుగును కష్టంగా జోడిస్తూ వెళ్లాడు. అతడు 44 బంతుల్లో 46 పరుగులు చేశాడు. క్లాసెన్ ఇన్నింగ్స్ లో 3 సిక్స్ లు, 2 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మిల్లర్ ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, ఒక ఫోర్ ఉన్నాయి. ఇద్దరూ మంచి హిట్టర్లే అయినా.. ఈ స్లో పిచ్ పై వాళ్ల ఆటలు సాగలేదు.
చెలరేగిన బంగ్లా బౌలర్లు..
టీ20 వరల్డ్ కప్ 2024లో ప్రతి జట్టు టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకుంటూ వస్తోంది. అయితే సౌతాఫ్రికా మాత్రం టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్లోనే డికాక్ రెండు ఫోర్లు కొట్టడంతో ఈ మ్యాచ్ లో మంచి స్కోరు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ ఓవర్ చివరి బంతికి రీజా హెండ్రిక్స్ (0) గోల్డెన్ డకౌట్ కావడంతో సఫారీల వికెట్ల పతనం మొదలైంది.
ఊపు మీద కనిపించిన డికాక్ (18), కెప్టెన్ మార్‌క్రమ్ (4), ట్రిస్టన్ స్టబ్స్ (0) దారుణంగా విఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓపెనింగ్ బౌలర్లు తాంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్ కళ్లు చెదిరే బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. తాంజిమ్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా.. తస్కిన్ 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ముస్తఫిజుర్ రెహమాన్ వికెట్ తీయకపోయినా.. అతడు కూడా 4 ఓవర్లలో కేవలం 18 రన్స్ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా పవర్ ప్లే ఆరు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 25 రన్స్ చేసింది. మిడిల్ ఓవర్లలో మళ్లీ పుంజుకున్నా.. డెత్ ఓవర్లలో మరోసారి తడబడింది. దీంతో 113 పరుగులతో సరిపెట్టుకుంది.