IND vs USA: ప్రపంచకప్ సూపర్-8కు దూసుకెళ్లిన భారత్.. అమెరికాపై గెలుపు.. అదరగొట్టిన సూర్య-ind vs usa t20 world cup 2024 india races in to super 8 after win over usa suryakumar yadav and arshdeep singh shines ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Usa: ప్రపంచకప్ సూపర్-8కు దూసుకెళ్లిన భారత్.. అమెరికాపై గెలుపు.. అదరగొట్టిన సూర్య

IND vs USA: ప్రపంచకప్ సూపర్-8కు దూసుకెళ్లిన భారత్.. అమెరికాపై గెలుపు.. అదరగొట్టిన సూర్య

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 13, 2024 12:04 AM IST

IND vs USA T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో అమెరికాపై టీమిండియా విజయం సాధించింది. దీంతో సూపర్-8కు చేరుకుంది. బౌలింగ్‍లో అర్షదీప్ సింగ్ సత్తాచాటితే.. బ్యాటింగ్‍లో సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపాడు.

IND vs USA: ప్రపంచకప్ సూపర్-8కు దూసుకెళ్లిన భారత్.. అమెరికాపై గెలుపు.. అదరగొట్టిన సూర్య
IND vs USA: ప్రపంచకప్ సూపర్-8కు దూసుకెళ్లిన భారత్.. అమెరికాపై గెలుపు.. అదరగొట్టిన సూర్య (PTI)

India vs USA T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో సూపర్-8కు దూసుకెళ్లింది టీమిండియా. వరుసగా మూడో విజయంతో దుమ్మురేపింది. దీంతో గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు భారత్ చేరింది. న్యూయార్క్ వేదికగా నేడు (జూన్ 12) జరిగిన ప్రపంచకప్ గ్రూప్-ఏ మ్యాచ్‍లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య అమెరికా జట్టుపై విజయం సాధించింది. స్వల్ప లక్ష్యమే అయినా పిచ్ బ్యాటింగ్‍కు కఠినంగా ఉండటంతో టీమిండియా కాస్త చెమటోడాల్సి వచ్చింది.

లక్ష్యఛేదనలో భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి విజయం సాధించింది. భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 50 పరుగులు నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత అర్ధ శకతం చేశాడు. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై అదరగొట్టాడు. గత రెండు మ్యాచ్‍ల్లో విఫలమైన శివమ్ దూబే (35 బంతుల్లో 31 పరుగులు నాటౌట్) ఈ మ్యాచ్‍లో నిలకడగా ఆడి రాణించాడు. 10 బంతులు మిగిల్చి గెలిచింది టీమిండియా.

ఆరంభంలో భారత్‍కు షాక్

111 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్‍కు ఆరంభంలో షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0)ని తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు అమెరికా బౌలర్ సౌరబ్ నేత్రవల్కర్. దీంతో కోహ్లీ గోల్డెన్ డక్‍గా వెనుదిరిగి.. ఈ ప్రపంచకప్‍లో మళ్లీ నిరాశపరిచాడు. మూడో ఓవర్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (3)ను కూడా నేత్రవర్కర్ ఔట్ చేశాడు. ఒకప్పుడు భారత్ తరఫున అండర్-19 ఆడిన అతడు.. ఇప్పుడు అమెరికా తరఫున ఆడుతూ టీమిండియాపై రాణించాడు. దీంతో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా టెన్షన్‍లో పడింది.

నిలిచి గెలిపించిన సూర్య, దూబే

రిషబ్ పంత్ (20 బంతుల్లో 20 పరుగులు) కాసేపు నిలకడగా ఆడాడు. అయితే, అలీ ఖాన్ వేసిన ఎనిమదో ఓవర్లో సరిగా బౌన్స్ కాని బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 44 పరుగుల వద్ద మూడో వికెట్ చేజారింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే నిలకడగా ఆడి పరుగులు రాబట్టారు. పిచ్ కఠినంగానే ఉన్నా నిలిచారు. అమెరికా బౌలర్లు కూడా కట్టదిట్టంగా బౌలింగ్ చేశారు. అయితే, సూర్య, దూబే క్రమంగా పరుగులు చేస్తూ లక్ష్యం దిశగా ముందుకు సాగారు. అయితే, 15వ ఓవర్ తర్వాత సూర్య, దూబే దూకుడుగా ఆడారు. లక్ష్యాన్ని కరిగించేశారు. 49 బంతుల్లో అర్ధ శతకానికి చేరాడు సూర్య కుమార్ యాదవ్. సూర్య, దూబే అజేయంగా 67 పరుగుల భాగస్వామ్యం జోడించారు. మొత్తంగా 18.2 ఓవర్లలోనే టీమిండియా గెలిచింది.

అర్షదీప్ అదుర్స్

అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది అమెరికా. భారత పేసర్ అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి అమెరికాను ఆరంభంలోనే దెబ్బ తీశాడు. మొత్తంగా అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. అమెరికా బ్యాటర్లలో నితీశ్ కుమార్ (27), స్టీవెన్ టేలర్ (24) పర్వాలేదనిపించగా.. మిగిలిన వారు ఎక్కువ సేపు నిలువలేకపోయారు. భారత బౌలర్లలో అర్షదీప్ నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‍లో రవీంద్ర జడేజాకు బౌలింగే ఇవ్వలేదు కెప్టెన్ రోహిత్ శర్మ.

ప్రపంచకప్‍లో తదుపరి గ్రూప్ దశలో కెనడాతో జూన్ 15న మ్యాచ్ ఆడనుంది భారత్. న్యూయార్క్‌లో తొలి మూడు మ్యాచ్‍లు ఆడిన టీమిండియా.. కెనడాతో ఫ్లోరిడా వేదికగా తలపడనుంది.

తొలిసారి టీ20 ప్రపంచకప్‍ ఆడుతున్న అమెరికా తొలి రెండు మ్యాచ్‍లు గెలిచి సత్తాచాటింది. పాకిస్థాన్‍కు కూడా షాకిచ్చి అదరగొట్టింది. అయితే, భారత్‍తో ఈ మ్యాచ్‍కు గాయం వల్ల రెగ్యులర్ కెప్టెన్ మెనాంక్ పటేల్ దూరమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‍లో అమెరికా టీమ్‍కు కెప్టెన్సీ చేశాడు ఆరోన్ జోన్స్. గ్రూప్ దశలో అమెరికాకు ఐర్లాండ్‍తో మ్యాచ్ మిగిలి ఉంది.

Whats_app_banner