David Johnson Died: టీమిండియా మాజీ క్రికెటర్ మృతి.. నాలుగో అంతస్తు నుంచి కింద పడటంతో..
David Johnson Died: టీమిండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి చెందాడు. బెంగళూరులోని నాలుగో అంతస్తులో ఉన్న తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కింద పడటంతో అతడు కన్ను మూశాడు.

David Johnson Died: టీమిండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ హఠాన్మరణం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. గురువారం (జూన్ 20) జరిగిన ప్రమాదంలో నాలుగో అంతస్తుపై నుంచి పడిన జాన్సన్.. హాస్పిటల్ కు తీసుకెళ్లేలోపే కన్నుమూసినట్లు చుట్టుపక్కల వాళ్ల వెల్లడించారు. 52 ఏళ్ల డేవిడ్ జాన్సన్.. ఇండియా తరఫున 2 టెస్టులు ఆడాడు.
డేవిడ్ జాన్సన్ కన్నుమూత
కర్ణాటకకు చెందిన డేవిడ్ జాన్సన్ గతంలో టీమిండియాకు పేస్ బౌలర్ గా సేవలందించాడు. ఈ మాజీ క్రికెటర్ గురువారం (జూన్ 20) బెంగళూరులోని నాలుగో అంతస్తులో ఉన్న తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కింద పడ్డాడు. అతన్ని వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లేలోగానే జాన్సన్ కన్నుమూసినట్లు పొరుగు వాళ్లు చెప్పారు.
ఏడాది కాలంగా జాన్సన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తరచూ హాస్పిటల్ కు వెళ్తూ వస్తూ ఉండేవాడు. గత వారం కూడా అతడు హాస్పిటల్లోనే ఉన్నాడు. మూడు రోజుల కిందటే డిశ్చార్జ్ అయ్యాడు. డేవిడ్ జాన్సన్ కు భార్య ఉన్నారు. అతని మరణంపై టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందించాడు.
"క్రికెట్ సహచరుడు డేవిడ్ జాన్సన్ చనిపోయాడని తెలిసి చాలా బాధగా ఉంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. చాలా త్వరగా వెళ్లిపోయావ్ బెన్నీ" అని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా కుంబ్లే తన సంతాపం తెలిపాడు. గతంలో కుంబ్లే టీమిండియాతోపాటు కర్ణాటక జట్టుకు కూడా డేవిడ్ జాన్సన్ తో కలిసి ఆడాడు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతం
మాజీ క్రికెటర్ అయినా కూడా డేవిడ్ జాన్సన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవాడని, ఇల్లు గడవడం కోసం తరచూ స్నేహితుల నుంచి అప్పు తీసుకునేవాడని అతని సన్నిహితులు చెప్పారు. టీమిండియా తరఫున జాన్సన్ రెండు టెస్టులు ఆడాడు. 1996లో తొలిసారి ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్టులో అతడు ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు.
తర్వాత అదే ఏడాది సౌతాఫ్రికా టూర్ కు కూడా వెళ్లాడు. డర్బన్ లో జరిగిన తొలి టెస్టులో ఆడాడు. అతని కెరీర్లో అదే చివరి టెస్ట్. జాన్సన్ రెండు టెస్టుల్లో 5 పరుగులు చేయడంతోపాటు 3 వికెట్లు తీసుకున్నాడు. అయితే 2001-02 డొమెస్టిక్ సీజన్ వరకు కర్ణాటక తరఫున కొనసాగాడు. ఆ సమయంలో టీమిండియా స్టార్ పేస్ బౌలర్లు శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, దొడ్డ గణేష్ తో కలిసి ఆడాడు.
2009లో కర్ణాటక ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాగా.. అందులో బెళగావి పాంథర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2015లో మరోసారి ఈ లీగ్ కు తిరిగొచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత జాన్సన్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేవాడు. ఆ మధ్య అతని ఫ్రెండ్స్ కలిసి ఓ చారిటీ మ్యాచ్ ఆడి వచ్చిన డబ్బులతో జాన్సన్ కు ఓ ఇల్లు కొనిపించారు. ఆ ఇంట్లోనే అతడు ఉంటున్నాడు. ఇప్పుడు 52 ఏళ్ల వయసులోనే ఇలా అర్ధంతరంగా కన్నుమూయడం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.