Team India: టీమిండియా హెడ్‍కోచ్ ఎంపిక: గౌతమ్ గంభీర్‌కు పోటీగా సీనియర్.. ఇద్దరినీ ఇంటర్వ్యూ చేసిన బీసీసీఐ!
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ మొదలుపెట్టింది. అయితే, గౌతమ్ గంభీర్‌కు సీనియర్ కోచ్ డబ్ల్యూవీ రామన్ పోటీగా వచ్చారని తెలుస్తోంది.
Team India Head Coach: టీమిండియా తదుపరి హెడ్ కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్టు అంచనాలు బయటికి వచ్చాయి. ఇంటర్వ్యూ తర్వాత గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటిస్తుందనే టాక్ వచ్చింది. అయితే, గంభీర్‌కు పోటీగా హెడ్‍కోచ్ స్థానానికి మాజీ క్రికెటర్, సీనియర్ కోచ్ డబ్ల్యూవీ రామన్ కూడా దరఖాస్తు చేశారని సమాచారం బయటికి వచ్చింది. గతంలో భారత మహిళల జట్టుకు రామన్ కోచ్‍గా వ్యవహరించారు. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ స్థానానికి గంభీర్‌కు రామన్ పోటీగా వచ్చారు.

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ స్థానం నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నారు. దీంతో కొత్త కోచ్ నియామకం కోసం ప్రక్రియను బీసీసీఐ మొదలుపెట్టింది. గంభీర్ ఈ రేసులో ముందు ఉన్నారు. ఇప్పుడు రామన్ పోటీగా నిలిచారు.
ఇద్దరికీ ఇంటర్వ్యూలు
టీమిండియా హెడ్ కోచ్ స్థానం కోసం మంగళవారం (జూన్ 18) గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్‍ను బీసీసీఐ సీఏసీ (క్రికెట్ అడ్వజరీ కమిటీ) ఇంటర్వ్యూలు చేసిందని న్యూస్18 రిపోర్ట్ వెల్లడించింది. గంభీర్ వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలో పాల్గొని ప్రెజెంటేషన్ ఇచ్చారని సమాచారం. డబ్ల్యూవీ రామన్ ఇచ్చిన ప్రెజెంటేషన్ సీఏసీ సభ్యులను ఆకట్టుకుందని ఆ ఆ రిపోర్ట్ పేర్కొంది.
గంభీర్, రామన్‍తో పాటు ఓ విదేశీ కోచ్ కూడా భారత హెడ్ కోచ్ స్థానానికి అప్లై చేసుకున్నారట. ఆయనను బీసీసీఐ బుధవారం సీఏసీ ఇంటర్వ్యూ చేయనుందని తెలుస్తోంది.
గంభీర్ వైవే మొగ్గు
టీమిండియా హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్‌ను నియమించేందుకే బీసీసీఐ మొగ్గుచూపుతుందని ఓ సంబంధిత అధికారి చెప్పినట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది. సీఏసీకి నేరుగా ప్రతిపాదన చేసే అధికారం బీసీసీఐకు ఉంటుందని, అందుకే హెడ్‍కోచ్‍గా గంభీర్ ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ ఆఫీసర్ చెప్పినట్టు వెల్లడైంది.
గంభీర్ ‘సెపరేట్ టీమ్స్’ కండీషన్లు
తాను హెడ్ కోచ్ పదవి చేపట్టాలంటే బీసీసీఐకి గంభీర్ కొన్ని కండీషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. టీ20లు, వన్డేలకు ఓ టీమ్.. టెస్టులకు ఓ టీమ్ ఉండేలా చేయాలని గంభీర్ చెప్పాడట. ఇలా సెపరేట్ టీమ్స్ ఉండాలని అడిగాడని తెలుస్తోంది. అలాగే, తాను చెప్పిన వారినే సపోర్టింగ్ స్టాఫ్‍గా తీసుకోవాలని కూడా చెప్పాడని సమాచారం బయటికి వచ్చింది. గంభీర్ పెట్టిన నిబంధనలకు బీసీసీఐ కూడా సుముఖంగానే ఉందని తెలుస్తోంది. మరో రెండురోజుల్లోనే కొత్త హెడ్‍కోచ్‍పై ప్రకటన వస్తుందనే అంచనాలు ఉన్నాయి. టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‍గా జాంటీ రోడ్స్ నియామకం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు మెంటార్‌గా చేశారు గౌతమ్ గంభీర్. లక్నో టీమ్‍ను వీడి కేకేఆర్‌కు వెళ్లారు. గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అతడి దూకుడైన వ్యూహాలు కోల్‍కతా టీమ్‍కు కలిసి వచ్చాయి. కోల్‍కతా ఈ సీజన్‍లో ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో భారత హెడ్‍కోచ్ రేసులోకి గంభీర్ దూసుకొచ్చాడు. భారత్‍కు అతడినే కోచ్ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయయ్యాయి. బీసీసీఐ కూడా అదే విధంగా ముందుకు సాగింది. టీమిండియాకు హెడ్‍కోచ్‍గా ఉండడం తనకు కూడా ఇష్టమేనని గంభీర్ కూడా చెప్పాడు.