Virender Sehwag: టీ20 ప్రపంచకప్‍లో భారత తుదిజట్టులో ఎవరు ఉండాలో చెప్పిన సెహ్వాగ్.. పాండ్యా లేకుండానే..
24 April 2024, 16:01 IST
- Virender Sehwag - T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ తుది జట్టులో ఎవరు ఉండాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భారత మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. తన తుదిజట్టులో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు ఇవ్వలేదు. ఓ బౌలర్ పేరు సర్‌ప్రైజింగ్‍గా చెప్పాడు.
Virender Sehwag: టీ20 ప్రపంచకప్‍లో భారత తుదిజట్టులో ఎవరు ఉండాలో చెప్పిన సెహ్వాగ్.. పాండ్యా లేకుండానే..
Virender Sehwag: ఈ ఏడాది జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపికయ్యే భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ జరుగుతున్న తరుణంలో ఈ విషయంపై చర్చలు విపరీతంగా సాగుతున్నాయి. ప్రపంచకప్ కోసం టీమిండియాకు ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై, తుదిజట్టు ఎలా ఉండాలన్న దానిపై కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా టీ20 ప్రపంచకప్‍లో భారత తుదిజట్టులో ఎవరు ఉండాలనుకుంటున్నారో తాజాగా చెప్పారు. తన తుది జట్టును వెల్లడించారు.
గిల్ కంటే జైస్వాల్‍కే ఓటు
టీ20 ప్రపంచకప్‍లో భారత తుది జట్టులో యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ ఉండాలని వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. శుభ్‍మన్ గిల్‍ను కాదని ఫైనల్ ఎలెవెన్‍లో జైస్వాల్ ఉండాలని తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో యశస్వి ఓపెనింగ్‍కు వస్తే.. మూడో స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‍కు దిగాలని తన తుదిజట్టులో అభిప్రాయపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో ప్లేస్‍లో రావాలని చెప్పాడు. మైకేల్ వాన్, ఆడమ్ గిల్‍క్రిస్ట్‌తో ఓ పోడ్‍కాస్ట్‌లో పాల్గొన్న సెహ్వాగ్ ఈ తుదిజట్టును వెల్లడించాడు.
పాండ్యా తప్పించిన సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్ కోసం తాను అనుకుంటున్న భారత తుదిజట్టులో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సెహ్వాగ్ చోటు ఇవ్వలేదు. ప్రస్తుత ఐపీఎల్‍లో ముంబై ఇండియన్స్ తరఫున స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న హార్దిక్‍ను పక్కనపెట్టాడు. రింకూ సింగ్, శివం దూబేల్లో ఒకరు తుదిజట్టులో ఉండాలని చెప్పారు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఉండాలని చెప్పాడు.
బౌలర్లు ఇలా..
రాజస్థాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మను టీ20 ప్రపంచకప్ భారత తుదిజట్టులో తీసుకోవాలని వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. అయితే, అతడు అసలు ప్రపంచకప్‍కు ఎంపికవుతాడా అన్నది చూడాలి. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండాలని అన్నాడు. పేసర్లు మహమ్మద్ సిరాజ్, జస్‍ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్‍లో భారత తుది జట్టులో ఉండాలని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్ కోసం సెహ్వాగ్ అనుకుంటున్న భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దూబే/రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‍ప్రీత్ బుమ్రా, సందీప్ శర్మ
ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ టోర్నీ సాగనుంది. ఈ మెగాటోర్నీ కోసం మే 1వ తేదీలోగా 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును బీసీసీఐ.. ఐసీసీకి పంపాల్సి ఉంది.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆటగాళ్ల ఎంపిక కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ ఏప్రిల్ 28 లేకపోతే ఏప్రిల్ 29న సమావేశం అవుతుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొంటాడని తెలుస్తోంది.