Vinod Kambli Sachin Tendulkar: సచిన్ చేయి పట్టుకొని వదలని వినోద్ కాంబ్లి.. పాత స్నేహితులు మళ్లీ కలిసిన వీడియో వైరల్
04 December 2024, 8:03 IST
- Vinod Kambli Sachin Tendulkar: వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్లో తన పాత స్నేహితుడిని కలిసి కాంబ్లి.. సచిన్ చేయిని వదలకుండా అలాగే పట్టుకోవడం అందులో చూడొచ్చు.
సచిన్ చేయి పట్టుకొని వదలని వినోద్ కాంబ్లి.. పాత స్నేహితులు మళ్లీ కలిసిన వీడియో వైరల్
Vinod Kambli Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి గురించి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ క్రికెట్ కు వీళ్లు అందించిన సేవలతోపాటు ఫీల్డ్ బయట వాళ్ల మధ్య స్నేహం గురించి కూడా అందరికీ తెలుసు. అయితే ఈ మధ్యే ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు ముంబైలో ఓ ఈవెంట్ సందర్బంగా కలిసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సచిన్ చేయి వదలని కాంబ్లి
సచిన్, వినోద్ కాంబ్లి ఇద్దరూ రమాకాంత్ అచ్రేకర్ శిష్యులే. ఇద్దరూ ఇండియన్ క్రికెట్ లోకి దూసుకొచ్చి తమదైన ముద్ర వేసిన తీరు కూడా ఒకేలా ఉంటుంది. అయితే ఆ ఇద్దరిలో ఒకరు ప్రపంచమే మెచ్చిన గొప్ప క్రికెటర్ గా నిలవగా.. మరొకరు మొదట్లోనే కనుమరుగైపోయారు. ఇప్పుడు వినోద్ కాంబ్లి పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం సరిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలో మంగళవారం (డిసెంబర్ 3) దివంగత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈవెంట్లో సచిన్ ను కలిశాడు కాంబ్లి. అతన్ని చూడగానే భావోద్వేగానికి గురైన కాంబ్లి.. స్టేజ్ పైకి వచ్చిన సచిన్ చేయి పట్టుకొని వదలకుండా అలాగే ఉండిపోయాడు. సచిన్ మాత్రం చేయి వదిలించుకొని ముందుకు సాగాలని అనుకున్నా.. కాంబ్లి మాత్రం వదల్లేదు. పక్కనే ఉన్న వ్యక్తి చొరవతో మొత్తానికి సచిన్ ముందుకు సాగాడు.
ఈవెంట్ తర్వాత కూడా సచిన్ తో కాంబ్లి ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది. మాస్టర్ తలపై ఆప్యాయంగా నిమురుతూ కాంబ్లి మాట్లాడాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది. ఈ ఈవెంట్ కు సచిన్, కాంబ్లితోపాటు అచ్రేకర్ శిష్యులైన మాజీ క్రికెటర్లు పరాస్ మాంబ్రే, ప్రవీణ్ ఆమ్రే, బల్విందర్ సింగ్ సంధు, సమీర్ దిఘే, సంజయ్ బంగార్ లాంటి వాళ్లు కూడా వచ్చారు.
సచిన్ ఇలా.. కాంబ్లి అలా..
సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలో ఓ ఎవరెస్ట్ గా ఎదిగాడు. ప్రపంచంలోనే బ్రాడ్‌మన్ తర్వాత అత్యుత్తమ బ్యాటర్ గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతడు సాధించినన్ని సెంచరీలు, పరుగులు మరెవరికీ సాధ్యం కాలేదు. ఓవైపు మాస్టర్ జర్నీ ఇలా సాగితే.. వినోద్ కాంబ్లి మాత్రం కెరీర్ మొదట్లోనే గాడి తప్పాడు. మొదట్లోనే రెండు వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలతో ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన కాంబ్లి.. ఆ ఫామ్ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు.
టీమిండియా తరఫున కేవలం 17 టెస్టులు, 104 వన్డేలు మాత్రమే ఆడాడు. 2000లో అతని కెరీర్ ముగిసింది. తర్వాత మందుకు బానిసయ్యాడు. కుటుంబాన్ని పోషించడానికి కష్టాలు పడ్డాడు. బీసీసీఐ అందించే పెన్షన్ పై జీవితం గడుపుతున్నాడు. ఇప్పుడు కనీసం సరిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ మధ్య అలాంటి వీడియో ఒకటి వైరల్ కాగా.. అతన్ని సచిన్ ఆదుకోవాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.