Vinod Kambli: నడవడానికీ ఇబ్బంది పడుతున్న మాజీ క్రికెటర్ కాంబ్లి.. ఫ్రెండ్‌కు సాయం చేయమని సచిన్‌ను అడుగుతున్న ఫ్యాన్స్
Vinod Kambli: నడవడానికీ ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని చూసి అతని బెస్ట్ ఫ్రెండ్ సచిన్ టెండూల్కర్ ను సాయం చేయాల్సిందిగా అడుగుతున్నారు అభిమానులు.
Vinod Kambli: వినోద్ కాంబ్లి తెలుసు కదా. ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో సంచలనం సృష్టించిన బ్యాటర్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు బెస్ట్ ఫ్రెండ్. ఈ ఇద్దరూ కలిసి స్కూల్ క్రికెట్ లోనే కాదు.. తర్వాత ఇండియన్ క్రికెట్ లోనూ తమదైన ముద్ర వేశారు. అలాంటి కాంబ్లి ఇప్పుడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. అతనికి సంబంధించి వీడియో ఒకటి మంగళవారం (ఆగస్ట్ 6) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీన స్థితిలో వినోద్ కాంబ్లి
టీమిండియా తరఫున 1990ల్లో టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన 52 ఏళ్ల వినోద్ కాంబ్లి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిపోయింది. కనీసం తన కాళ్లపై తాను నడవలేని దీన స్థితిలో అతడు ఉన్నాడు. అతన్ని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు నడవడానికి సాయం చేస్తున్న వీడియో ఒకటి మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన ఫ్యాన్స్.. నీ ఫ్రెండ్ ను జాగ్రత్తగా చూసుకో అని, సాయం చేయమని సచిన్ టెండూల్కర్ ను అడుగుతున్నారు.
కాంబ్లి ఆరోగ్యం అస్సలు బాగోలేదని ఆ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. అయితే ఆ వీడియోలో ఉన్న కాంబ్లినేనా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ మరణానికి నివాళి అర్పిస్తూ ట్వీట్ చేసిన సచిన్.. నీ ఫ్రెండ్ దుస్థితి కనిపించడం లేదా అంటూ కొందరు టెండూల్కర్ ను నిలదీయడం గమనార్హం.
కాంబ్లికి అనారోగ్య సమస్యలు
వినోద్ కాంబ్లి గత దశాబ్ద కాలంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. 2013లో అతనికి గుండెపోటు కూడా వచ్చింది. అంతకుముందు అతనికి సర్జరీ కూడా జరిగింది. క్రికెట్ లో ఉవ్వెత్తున ఎగిసినా.. తర్వాత సచిన్ లాంటి క్రమశిక్షణ లేక క్రమంగా తెరమరుగైపోయిన కాంబ్లి.. తర్వాత ఆల్కహాల్ కు బానిసై ఇంత వరకూ తెచ్చుకున్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
సచిన్, కాంబ్లి స్నేహం
సచిన్, కాంబ్లి పదేళ్ల వయసున్నప్పటి నుంచే మంచి స్నేహితులు. సచిన్ కంటే కాంబ్లి రెండేళ్లు పెద్దవాడు. ఇద్దరూ ముంబైకి చెందిన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ దగ్గరే శిక్షణ తీసుకున్నారు. ఇద్దరూ ఆ తర్వాత టీమిండియాకు ఆడారు. సచిన్ 1989లోనే ఇండియా తరఫున అరంగేట్రం చేయగా.. కాంబ్లి 1991లో టీమ్ లోకి వచ్చాడు. ఇండియా తరఫున కాంబ్లి 104 వన్డేలు, 17 టెస్టులు ఆడాడు.
1991, 2000 మధ్య కాంబ్లి వన్డేల్లో 2477 పరుగులు.. టెస్టుల్లో 1084 రన్స్ చేశాడు. వన్డేల్లో రెండు, టెస్టుల్లో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చీ రాగానే తొలి రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన కాంబ్లి సంచలనం సృష్టించాడు. కానీ అతని కెరీర్ వెంటనే గాడి తప్పింది. 1995లో కాంబ్లి 24 ఏళ్ల వయసులో తన చివరి టెస్టు ఆడాడు.
ఇక అక్టోబర్ 2000లో చివరి వన్డేలో ఇండియన్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2009లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు సచిన్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. అతడు 200 టెస్టులు, 463 వన్డేల్లో 34 వేలకుపైగా రన్స్ చేశాడు. 100 సెంచరీలు చేశాడు. 2013లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.