Graham Thorpe Dead: 100 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత.. ఏమైందంటే?-former england cricketer graham thorpe died of illness aged 55 thorpe played 100 tests ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Graham Thorpe Dead: 100 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత.. ఏమైందంటే?

Graham Thorpe Dead: 100 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత.. ఏమైందంటే?

Hari Prasad S HT Telugu
Aug 05, 2024 02:35 PM IST

Graham Thorpe Dead: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ కన్నుమూశాడు. అతడు 1993-2005 మధ్య ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు.

100 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత.. ఏమైందంటే?
100 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత.. ఏమైందంటే? (Action Images via Reuters)

Graham Thorpe Dead: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, మాజీ కోచ్ గ్రాహం థోర్ప్ సోమవారం (ఆగస్ట్ 5) కన్నుమూశాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని వయసు 55 ఏళ్లు. థోర్ప్ 1993-2005 మధ్య ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 44.66 సగటుతో 16 సెంచరీలు సహా 6,744 పరుగులు చేశాడు. స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ అయిన థోర్ప్.. వన్డేల్లో 37.18 సగటు, 21 అర్ధసెంచరీలతో 2380 పరుగులు చేశాడు.

గ్రాహం థోర్ప్ కన్నుమూత

ఇంగ్లండ్ అత్యుత్తమ టెస్టు బ్యాటర్లలో ఒకడిగా గ్రాహం థోర్ప్ కు పేరుంది. అతని మరణవార్త ఆ దేశ క్రికెటర్లనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లను విస్మయానికి గురి చేసింది. చాలా కాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతూ 55 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం నిజంగా విషాదమనే చెప్పాలి. అతని మరణ వార్తను ఈసీబీ వెల్లడించింది.

'ఎంబీఈ గ్రాహం థోర్ప్ కన్నుమూశారన్న వార్తను చాలా విచారంతో పంచుకుంటున్నాం. గ్రాహం మరణంతో కలిగిన తీవ్ర దిగ్భ్రాంతిని వర్ణించడానికి సరైన పదాలు లేవు. ఇంగ్లండ్ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లలో ఒకడైన అతను క్రికెట్ కుటుంబానికి ప్రియమైన సభ్యుడు.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అతన్ని గౌరవించారు. అతని మరణంతో క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్లిష్ట సమయంలో అతని భార్య అమండా, అతని పిల్లలు, తండ్రి జెఫ్, అతని కుటుంబం, స్నేహితులందరికీ మా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాం" అని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

థోర్ప్ కెరీర్ ఇలా..

గ్రాహం థోర్ప్ సర్రే తరఫున 17 సంవత్సరాలు ఆడాడు. అక్కడ అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 241 మ్యాచ్ లు, 271 లిస్ట్ ఎ మ్యాచ్ లు ఆడటం విశేషం. కౌంటీ జట్టు కోసం 20,000 కి పైగా పరుగులు చేశాడు. థోర్ప్ మరణంతో సర్రే కౌంటీ కూడా అతని కుటుంబానికి సంతాపం తెలిపింది.

ఒక క్రికెటర్ గా, ఒక వ్యక్తిగా క్లబ్ కు అతను అద్భుతమైన సేవలు అందించాడు.. అతన్ని మేము చాలా మిస్ అవుతాము అని సర్రే కౌంటీ తమ సంతాప ప్రకటనలో తెలిపింది. సర్రే సీఈఓ స్టీవ్ ఎల్వర్తీ మాట్లాడుతూ.. గ్రాహం మరణవార్తతో క్లబ్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. క్లబ్ కోసం, దేశం కోసం అద్భుతమైన విజయాలు సాధించి ఎంతో మంది క్రికెట్ అభిమానులకు హీరోగా నిలిచాడు అని అన్నారు.

ప్లేయర్ గానే కాదు ఇంగ్లండ్ కు బ్యాటింగ్ కోచ్ గా, సహాయ కోచ్ గా పని చేశాడు. 2022లో అతను తప్పుకున్నాడు. యాషెస్ లో ఆస్ట్రేలియా చేతుల్లో 0-4తో ఓటమి తర్వాత థోర్ప్ తన పదవికి రాజీనామా చేశాడు. అదే ఏడాది ఆఫ్ఘనిస్థాన్ టీమ్ హెడ్ కోచ్ అయ్యాడు. అయితే అదే సమయానికి తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాడు.