Virat Kohli RCB : గుజరాత్లో విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు.. నలుగురు అరెస్ట్
22 May 2024, 14:25 IST
- RR vs RCB, IPL 2024: ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌కి ముందు జరగాల్సిన ఏకైన ప్రాక్టీస్ సెషన్‌ని ఆర్సీబీ రద్దు చేసుకుంది. విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉండటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు..!
RCB vs RR eleminator : గుజరాత్ అహ్మదాబాద్‌లో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌కి ముందు ఉన్న ఏకైక ప్రాక్టీస్ సెషన్‌తో పాటు మీడియా సమావేశాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరూ ఆర్సీబీ రద్దు చేసుకుంది. జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే.. ఆర్సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఇదే విషయంపై పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
మంగళవారం.. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ 2024 క్వాలిఫయర్స్ జరిగింది. ఇదే వేదికలో బుధవారం ఆర్ఆర్- ఆర్సీబీలు తలపడనున్నాయి. అయితే.. కేకేఆర్- ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కారణంగా.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్ఆర్, ఆర్సీబీ జట్లు ప్రాక్టీస్ చేయలేకపోయాయి. ఇరు జట్ల ప్రాక్టీస్ కోసం.. గుజరాత్ కాలేజ్ గ్రౌండ్స్‌ని కేటాయించారు. కానీ ఆర్సీబీ ప్రాక్టీస్ చేయలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రాక్టీస్ చేసుకుంది. సాయంత్రం జరగాల్సిన మీడియా సమావేశాన్ని ఇరు జట్లు నిర్వహించలేదు. ఇది చాలా అరుదైన విషయం.
ఆనందబజార్ పత్రిక ప్రకారం.. ఆర్సీబీ ప్రాక్టీస్ చేయకపోవడానికి కారణం.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉండటం. ఇందుకు సంబంధించి.. సోమవారం రాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురు.. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానాలు ఇందుకు కారణం. ఈ నలుగురికి సంబంధించిన హైడౌట్స్ని రైడ్ చేసిన అనంతరం.. ఆయుదాలు, అనుమానాస్పద వీడియో- మెసేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Virat Kohli security issue : ఇదే విషయాన్ని ఆర్ఆర్- ఆర్సీబీ జట్లకు మంగళవారం వెల్లడించారు పోలీసులు. ఆర్ఆర్ స్పందించలేదు. ఆర్సీబీ మాత్రం.. ప్రాక్టీస్ సెషన్‌ని రద్దు చేసుకుంటున్నట్టు భద్రతా సిబ్బందికి చెప్పింది.
ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ వంటి భారీ ఈవెంట్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్స్ రద్దు చేసుకోవడం చాలా అరుదైన విషయం. బలమైన కారణాలు ఉంటేనే ఇలా జరుగుతుంది.
ఈ వ్యవహారంపై పోలీసు అధికారి విజయ్ సింఘ జ్వలా మాట్లాడుతు.. "నలుగురు అరెస్ట్ అయ్యారన్న విషయం.. అహ్మదాబాద్‌కు వచ్చిన తర్వాత కోహ్లీ తెలుసుకున్నాడు. విరాట్ కోహ్లీ జాతీయ సంపద! అతని సెక్యూరిటీకి కీలక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్సీబీకి రిస్క్ తీసుకోవాలనిపించలేదు. ప్రాక్టీస్ చేయడం లేదని మాకు చెప్పారు. రాజస్థాన్ రాయల్స్‌కి కూడా చెప్పాము. కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికి వారికి ఇబ్బందులు కనిపంచలేదు," అని అన్నారు.
టీమ్ హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రత..
Virat Kohli latest news : మరోవైపు.. అహ్మదాబాద్‌లో ఆర్సీబీ టీమ్ బస చేస్తున్న హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఆర్సీబీ సభ్యులకు ప్రత్యేక ఎంట్రీని ఏర్పాటు చేశారు. ఇతరులు అందులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐపీఎల్‌కు సంబంధించిన మీడియా సిబ్బందిని కూడా హోటల్ లోపలికి అనుమతించలేదు.
"ఆర్ఆర్ టీమ్‌ని మూడూ పోలీస్ కాన్వాయ్‌లు ఎస్కార్ట్ చేశాయి. సంజూ సామ్సన్ ఆలస్యంగా వెల్లాడు. అశ్విన్, రియాన్ పరాగ్, చాహల్‌లు హోటల్లోనే ఉండిపోయారు. భారీ భద్రత మధ్య మిగిలిన ఆర్ఆర్ సభ్యులు ప్రాక్టీస్ చేశారు. పోలీసులు గ్రౌండ్ మొత్తం పాట్రోలింగ్ చేశారు," అని సదరు వార్తా సంస్థ తెలిపింది.