తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup Records: వరల్డ్ కప్‌లో ఈ 6 రికార్డులూ బ్రేక్ అవుతాయా.. రోహిత్, కోహ్లిలపైనే అందరి కళ్లూ

World Cup Records: వరల్డ్ కప్‌లో ఈ 6 రికార్డులూ బ్రేక్ అవుతాయా.. రోహిత్, కోహ్లిలపైనే అందరి కళ్లూ

Hari Prasad S HT Telugu

02 October 2023, 11:37 IST

google News
    • World Cup Records: వరల్డ్ కప్‌లో ఈ 6 రికార్డులూ బ్రేక్ అవుతాయా? ఈ రికార్డుల విషయంలో అందరి కళ్లూ రోహిత్, కోహ్లిలపైనే ఉన్నాయి. ఇక మిచెల్ స్టార్క్, షమి, శుభ్‌మన్ గిల్ లాంటి వాళ్లు కూడా రేసులో ఉన్నారు.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ (AFP)

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ

World Cup Records: వరల్డ్ కప్ 2023 మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. 12 ఏళ్ల తర్వాత ఇండియా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో కొన్ని వరల్డ్ రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో ఫేవరెట్స్ లో ఒకటిగా ఇండియా బరిలోకి దిగుతుండగా.. టీమ్ లోని స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ ఏడు రికార్డుల్లో మూడింటిని బ్రేక్ చేయడానికి సిద్ధమవుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో బ్రేకయ్యే అవకాశాలు ఉన్న ఆ 6 రికార్డులు ఏంటో ఒకసారి చూద్దాం.

వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు

వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. ఒకప్పుడు ఈ రికార్డు అందుకోవడం అసాధ్యమనుకున్నా.. ఇప్పుడు విరాట్ కోహ్లి దానికి మరీ దగ్గరగా వచ్చేశాడు. ప్రస్తుతం 47 సెంచరీలతో ఉన్న కోహ్లి మరో రెండు చేస్తే సచిన్ ను సమం చేస్తాడు. వరల్డ్ కప్ లో కనీసం 9 మ్యాచ్ లు ఆడే అవకాశం కోహ్లికి ఉంది. ఈ నేపథ్యంలో టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లి వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

అత్యధిక సిక్స్‌ల రికార్డు

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్స్‌ల రికార్డుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరగా ఉన్నాడు. ప్రస్తుతం గేల్ 554 సిక్స్‌లతో టాప్ లో ఉండగా.. రోహిత్ 551 సిక్స్ లు బాదాడు. ఈ లెక్కన వరల్డ్ కప్ లో అత్యధిక సిక్స్ ల రికార్డు రోహిత్ సొంతమవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వరల్డ్ కప్ లోనూ 49 సిక్స్ లతో గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. రోహిత్ 23 సిక్స్ లు బాదాడు. గేల్ రికార్డును బ్రేక్ చేయడం కష్టమే అయినా.. ఇండియా తరఫున అత్యధిక సిక్స్ లు బాదిన ప్లేయర్ గా సచిన్ (29), గంగూలీ (27) రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

అత్యధిక వికెట్ల రికార్డు

వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్ల రికార్డు ఆస్ట్రేలియా లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (71 వికెట్లు) పేరిట ఉంది. ఈ రికార్డుకు ఇప్పుడు మరో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గత రెండు వరల్డ్ కప్ లు అంటే 2015, 2019లలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా స్టార్క్ నిలిచాడు. 2015లో 22, 2019లో 27 వికెట్లు తీశాడు. మొత్తం 49 వరల్డ్ కప్ వికెట్లతో ఉన్న స్టార్క్.. ఈసారి కూడా అదే ఊపు కొనసాగిస్తే.. మెక్‌గ్రాత్ రికార్డు మరుగున పడుతుంది.

వరల్డ్ కప్‌లలో అత్యధిక సెంచరీల రికార్డు

వరల్డ్ కప్ లలో అత్యధిక సెంచరీల రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ ఆరు సెంచరీలు చేశాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కూడా 6 సెంచరీలతో సచిన్ తో సమంగా ఉన్నాడు. దీంతో ఈ వరల్డ్ కప్ లో మాస్టర్ రికార్డు రోహిత్ బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. 2019 వరల్డ్ కప్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి 5 సెంచరీలు చేశాడు రోహిత్. వరల్డ్ కప్ ఒక ఎడిషన్ లో అత్యధిక సెంచరీల రికార్డు ఇదే.

కేలండర్ ఏడాదిలో అత్యధిక వన్డే పరుగులు

ఒక కేలండర్ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుకు శుభ్‌మన్ గిల్ చేరువలో ఉన్నాడు. 2023లో ఇప్పటి వరకూ గిల్ వన్డేల్లో 1230 రన్స్ చేశాడు. ఇప్పుడు వరల్డ్ కప్ లో కనీసం 9 మ్యాచ్ లు ఆడే అవకాశం ఉండటంతో మరో 665 రన్స్ చేస్తే సచిన్ పేరిట 25 ఏళ్లుగా ఉన్న రికార్డు బ్రేకవుతుంది.

అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ రికార్డు

వరల్డ్ కప్ లలో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా నిలిచే అవకాశం మహ్మద్ షమికి ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ ల పేరిట ఉంది. ఈ ఇద్దరూ 44 వికెట్లు తీశారు. ఇక షమి 11 వరల్డ్ కప్ మ్యాచ్ లలో 31 వికెట్లు తీశాడు. ఈసారి స్వదేశంలో జరగబోతున్న వరల్డ్ కప్ లో షమికి ఈ రికార్డు బ్రేక్ చేయడం సులువు కానుంది.

తదుపరి వ్యాసం