Ishan Kishan: రంజీ ట్రోఫీ కాదు! ఆ టోర్నీతో కమ్‍బ్యాక్ ఇవ్వనున్న ఇషాన్ కిషన్
13 February 2024, 18:30 IST
- Ishan Kishan: భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ త్వరలోనే మళ్లీ మైదానంలో బరిలోకి దిగనున్నాడు. కొంతకాలంగా విరామం తీసుకుంటున్న అతడు కమ్‍బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే, రంజీ ట్రోఫీ కాకుండా వేరే టోర్నీలో అతడు ఆడనున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే.
Ishan Kishan: రంజీ ట్రోఫీ కాదు! ఆ టోర్నీతో కమ్‍బ్యాక్ ఇవ్వనున్న ఇషాన్ కిషన్
Ishan Kishan: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహారం కొంతకాలంగా ఉత్కంఠగా మారింది. గత డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు నుంచి తప్పుకొని అతడు స్వదేశానికి వచ్చేశాడు. మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత కారణాలు చెప్పి ఆ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే, ఆ తర్వాత అతడు దుబాయ్‍లో పార్టీ చేసుకోవడం బయటికి వచ్చింది. టీమిండియాలోకి మళ్లీ రావాలంటే.. ఇషాన్ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించారు. అయితే, ఇషాన్ మాత్రం రంజీ ట్రోఫీ మ్యాచ్‍లు ఆడకుండా డుమ్మా కొడుతున్నాడు. దీంతో ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍కు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ తరుణంలో కిషన్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది.
ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ కూడా భారత్‍కు కీలకంగా ఉన్నాడు. ఈ తరుణంలో అతడు ఇలా చేస్తుండడంతో అతడి కెరీర్‌పై అనుమానాలు తలెత్తాయి. అయితే, ఇషాన్ కిషన్ ఎట్టకేలకు మళ్లీ మైదానంలోకి దిగేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది. అయితే, రంజీ ట్రోఫీ కాకుండా ముంబైలో జరిగే డీవై పాటిల్ టోర్నీని ఇషాన్ ఆడనున్నాడని దైనిక్ భాస్కర్ రిపోర్ట్ వెల్లడించింది.
డీవై పాటిల్ టీ20 టోర్నీతోనే ఇషాన్ కిషన్ కమ్‍బ్యాక్ చేయనున్నాడని ఆ రిపోర్ట్ పేర్కొంది. తన కుటుంబంతో సమయం గడిపేందుకు అతడు క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడని, ఇప్పుడు డీవై పాటిల్ టోర్నీతో మళ్లీ ఆట మొదలుపెట్టనున్నాడని వెల్లడించింది.
ద్రవిడ్ చెప్పింది ఇదే..
టీమిండియాలోకి మళ్లీ రావాలంటే ఇషాన్ కిషన్ కొన్ని క్రికెట్ మ్యాచ్‍లు ఆడాల్సిందేనని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. రంజీ ట్రోఫీ కాకున్నా ఏవైనా మ్యాచ్‍లు ఆడాలని చెప్పారు. దీంతో ఇషాన్.. డీవై పాటిల్ టోర్నీని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులోనూ.. రంజీ ట్రోఫీ ప్రస్తుత సీజన్ కోసం ఇషాన్‍ను తాము సంప్రదించలేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కూడా చెప్పిందట.
బీసీసీఐ వార్నింగ్
అంతర్జాతీయ మ్యాచ్‍లు ఆడుతున్న వారు, గాయంతో బాధ పడుతున్న వారు మినహా మిగిలిన ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో పాల్గొనాల్సిందేనని బీసీసీఐ ఇటీవల హెచ్చరిక చేసిందనే సమాచారం బయటికి వచ్చింది. కొందరు ఆటగాళ్లు ఇప్పటి నుంచే ఐపీఎల్‍పై దృష్టి సారిస్తూ.. రంజీకి డుమ్మా కొడుతుండటంపై సీరియస్ అయింది.
పాండ్యాతో కిషన్ ప్రాక్టీస్
హార్దిక్ పాండ్యాతో కలిసి ఇటీవల ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ మధ్యలోనే గాయంతో జట్టుకు దూరమయ్యాడు పాండ్యా. ప్రస్తుతం అతడు ఫిట్‍నెస్ సాధించినట్టు తెలుస్తోంది. అయినా.. పాండ్యా కూడా రంజీలు ఆడడం లేదు. ఇషాన్ కూడా రంజీలకు డుమ్మా కొడుతున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్.. హార్దిక్‍ను కెప్టెన్ చేసింది. ఇషాన్ కూడా ముంబై తరఫునే ఆడుతున్నాడు.
ఇలా కొందరు ఆటగాళ్లు అప్పుడే ఐపీఎల్ కోసం సన్నాహకాలు చేస్తున్నట్టు బీసీసీఐ గుర్తించింది. దీనిపై సీరియస్ అయి.. రంజీలు ఆడాల్సిందేనని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ వ్యవహారంలో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.