World Cup 2023: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో ఓటమికి ప్రధాన కారణం అదే: బీసీసీఐకి రాహుల్ ద్రవిడ్ వివరణ!
World Cup 2023: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో భారత్ ఓటమిపై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‍ను బీసీసీఐ వివరణ కోరిందని సమాచారం. పరాజయానికి ప్రధాన కారణాన్ని ద్రవిడ్ వివరించారని తెలుస్తోంది. ఆ వివరాలివే..
World Cup 2023: సొంతగడ్డపై ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‍లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. వరుసగా 10 విజయాలతో అదరగొట్టి ఫైనల్ వరకు అజేయంగా వచ్చింది టీమిండియా. అయితే, నవంబర్ 19న జరిగిన ప్రపంచకప్ ఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. టైటిల్‍ను సమీపించి తుది పోరులో బోల్తా కొట్టింది. అయితే, వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో జట్టు ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‍ను బీసీసీఐ వివరణ కోరిందని సమాచారం.
వన్డే ప్రపంచకప్ ఫైనల్ గురించి నిర్వహించిన సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ప్రపంచకప్ ఫైనల్‍లో పరాజయం గురించి ఈ సమావేశంలోనే రోహిత్, రాహుల్ ద్రవిడ్‍ను అధికారులు వివరణ అడిగారు. దీంతో ద్రవిడ్ స్పందించారు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో భారత జట్టు పరాజయం పాలయ్యేందుకు అహ్మదాబాద్ పిచ్ ప్రధాన కారణం అని రాహుల్ ద్రవిడ్.. బీసీసీఐ అధికారులకు చెప్పినట్టు సమాచారం బయటికి వచ్చింది. భారత మేనేజ్‍మెంట్ ఆశించింత మేర స్పిన్‍కు ఆ పిచ్‍కు సహకరించలేదని, ఎక్కువ టర్న్ కాలేదని ద్రవిడ్ చెప్పారట.
“మేం అంచనా వేసిన విధంగా పిచ్ నుంచి టర్న్ లభించలేదు. ఒకవేళ మా స్పిన్నర్లకు సరిపడా టర్న్ లభించి ఉంటే.. మేం గెలిచి ఉండేవాళ్లం” అని బీసీసీఐ అధికారులకు ద్రవిడ్ చెప్పినట్టు సమాచారం బయటికి వచ్చింది.
వన్డే ప్రపంచకప్ ఫైనల్ అప్పటికే వినియోగించిన పిచ్‍పై జరిగింది. లీగ్ దశలో ఇదే పిచ్‍పై పాకిస్థాన్‍తో ఇండియా మ్యాచ్ ఆడింది. ఫైనల్‍లో అహ్మదాబాద్ పిచ్ చాలా స్లోగా మారిందని, ఆస్ట్రేలియా బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారని కూడా ద్రవిడ్ చెప్పారట.
వన్డే ప్రపంచకప్‍తో హెడ్ కోచ్‍గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టు ముగిసింది. అయితే 2024 టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని అతడిని ఒప్పించిన బీసీసీఐ.. కాంట్రాక్టును పొడిగించింది.
వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలై టైటిల్‍ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగిలిన టీమిండియా బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అర్ధ శతకాలు చేసినా వేగంగా పరుగులు చేయలేకపోయారు. లక్ష్యఛేదనలో 43 ఓవర్లలోనే 4 వికెట్లకు 241 రన్స్ చేసిన ఆస్ట్రేలియా గెలిచింది. ట్రావిస్ హెడ్ (137) సెంచరీతో కదం తొక్కాడు.