Hardik Pandya divorce: విడాకులను కన్ఫర్మ్ చేసిన హార్దిక్ పాండ్యా.. ‘కలిసి ఉండేందుకు ప్రయత్నించినా..’
19 July 2024, 9:17 IST
- Hardik Pandya divorce: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. నటాషాతో తాను విడిపోయానని అతడు వెల్లడించాడు.
Hardik Pandya divorce: విడాకులను కన్ఫర్మ్ చేసిన హార్దిక్ పాండ్యా.. కలిసి ఉండేందుకు ప్రయత్నించినా కుదరలేదంటూ..
Hardik Pandya divorce: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారంపై కొంతకాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. భార్య నటాషా స్టాంకోవిచ్‌తో అతడు విడిపోతున్నాడంటూ సమాచారం చక్కర్లు కొట్టింది. ఈ తతంగంపై హార్దిక్ పాండ్యా క్లారిటీ ఇచ్చేశాడు. భార్య స్టాంకోవిచ్‌తో విడిపోయినట్టు నేడు (జూలై 18) అతడు వెల్లడించాడు. విడాకులు తీసుకున్నట్టు కన్ఫర్మ్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని హార్దిక్ ప్రకటించాడు.
విడిపోతేనే మేలని అనుకున్నాం..
హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ 2020 జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది మేలో వీరి వివాహం జరిగింది. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. నాలుగేళ్ల బంధం తర్వాత హార్దిక్, నటాషా విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని హార్దిక్ పాండ్యా ఇప్పుడు అధికారికంగా వెల్లడించాడు. తాము కలిసి ఉండేందుకు అన్ని విధాల ప్రయత్నించామని, కానీ కుదరలేదని హార్దిక్ పాండ్యా నేడు ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నాడు. ఇద్దరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇక విడిపోవడమే మేలని అనుకున్నామని రాసుకొచ్చాడు.
కఠినమైన నిర్ణయమే..
తాము ఇంత కాలం సంతోషంగా గడిపామని, పరస్పరం గౌరవించుకున్నామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే, విడిపోవాలని నిర్ణయించుకోవడం కఠినమైనదే అని పేర్కొన్నాడు. “నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నేను, నటాషా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేం కలిసి ఉండేందుకు మా వంతు ప్రయత్నించాం. అయితే, విడిపోవడమే మా ఇద్దరికీ ప్రయోజనం అని మేం నమ్ముతున్నాం. మేం సంతోషంగా ఉంటూ పరస్పరం గౌరవించుకున్నాం. కలిసి ఎంజాయ్ చేస్తూ కుటుంబంగా ఎదిగాం. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే ఉంది” అని హార్దిక్ పాండ్యా రాసుకొచ్చాడు.
తల్లిదండ్రులుగా ఉంటాం
భాగస్వాములుగా విడిపోయినా కుమారుడు అగస్త్యకు తాము తల్లిదండ్రులుగా కొనసాగుతామని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. “మాకు అగస్త్య ఉన్నాడు. మా ఇద్దరి జీవితాలకు కేంద్రంగా అతడు ఉంటాడు. కో-పేరెంట్స్‌గా అతడికి చేయాల్సిందంతా చేస్తూ సంతోషం అందిస్తాం. ఈ కష్టతరమైన, సున్నితమైన సమయంలో మీరు అర్థం చేసుకొని మద్దతు ఇవ్వాలని, మా ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నా” అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. నటాషా కూడా ఈ నోట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
హార్దిక్ - నటాషా బంధం ఇలా..
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ డేటింగ్లో ఉన్నారని 2018లోనే రూమర్లు వచ్చాయి. బెస్ట్ ఫ్రెండ్ అంటూ హార్దిక్‌తో ఉన్న ఫొటోను 2019లో నటాషా పోస్ట్ చేసింది. ఆ తర్వాత 2020 జనవరి 1వ తేదీన హార్దిక్, నటాషా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2020 మే 31వ తేదీన వివాహం చేసుకున్నారు. అదే ఏడాది జూలైలో వీరికి అగస్త్య జన్మించారు. మూడేళ్ల బంధం తర్వాత 2023 ఫిబ్రవరి 14న ఉదయ్‌పూర్‌లో వీరు మరో వేడుక చేసుకున్నారు.
హార్దిక్ పాండ్యా, నటాషా విడిపోనున్నారంటూ ఈ ఏడాది మే నుంచి రూమర్లు వస్తున్నాయి. హార్దిక్‌తో కలిసి ఉన్న ఫొటోలను నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్ చేయడంతో ఇవి మొదలయ్యాయి. అలాగే, ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ పాండ్యా ఆడిన మ్యాచ్‌ల్లో నటాషా ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరు విడిపోనున్నారనే రూమర్లు తీవ్రమయ్యాయి. ఎట్టకేలకు రూమర్లే నిజమయ్యాయి. తాము విడిపోతున్నట్టు హార్దిక్, నటాషా నేడు ప్రకటించారు.
గత నెల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ గెలువడంలో హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. అయితే, శ్రీలంకతో తదుపరి టీ20 సిరీస్‌కు హార్దిక్ ఎంపికైనా వైస్ కెప్టెన్ స్థానాన్ని కోల్పోయాడు. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు.