Hardik Pandya: భార్యకు విడాకులు ఇవ్వనున్న హార్దిక్ పాండ్య - భరణం కింద ఆస్తుల్లో 70 శాతం కోల్పోనున్న క్రికెటర్
Hardik Pandya: భార్య నటాషాకు టీమిడియా క్రికెటర్ హార్దిక్ పాండ్య విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అభిప్రాయభేదాలతో ఈ జంట విడిపోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతోన్నాయి.
Hardik Pandya: పేలవ ఫామ్ కారణంగా ఐపీఎల్‌లో దారుణంగా విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలినట్లు సమాచారం. భార్య నటాషా స్టాంకోవిక్‌కు హార్దిక్ పాండ్య విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనస్పర్థలతోనే ఈ జంట విడిపోనున్నట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. శనివారమే (నేడు) వీరి విడాకులపై కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అభిప్రాయభేదాలు...
హార్దిక్, నటాషా మధ్య కొన్నాళ్లుగా అభిప్రాయభేదాలు నెలకొన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతోన్నాయి. గొడవల వల్ల పాండ్యకు నటాషా దూరంగా ఉంటోన్నట్లు చెబుతోన్నారు. పాండ్యతో పెళ్లి తర్వాత నటాషా స్టాంకోవిక్ పాండ్య పేరుతో ఇన్నాళ్లు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కొనసాగించింది నటాషా.
ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పాండ్య పేరును తొలగిస్తూ నటాషా స్టాంకోవిక్‌గా మార్చుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో నటాషా ఒక్కసారి కూడా ముంబై మ్యాచ్‌లను చూడటానికి రాలేదు. ముంబై క్రికెటర్లు చాలా సార్లు తమ భార్యలతో ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు. కానీ పాండ్యను కలవడానికి నటాషా ఒక్కసారి కూడా స్టేడియానికి రాకపోవడం, మ్యాచ్‌లకు హాజరుకాకపోవడం అనుమానాలకు తావిచ్చింది.
సోషల్ మీడియా పోస్టులు లేవు...
పేలవ ప్రదర్శన కారణంగా హార్దిక్ పాండ్యపై కొన్నాళ్లుగా విమర్శలు పెరిగిపోయాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అతడికి సపోర్ట్‌గా నిలుస్తూ నటాషా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టలేదు. ఇటీవలే నటాషా బర్త్‌డే జరిగింది. పెళ్లి తర్వాత నటాషా ప్రతి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు పాండ్య.
కానీ ఈ సారి మాత్రం వేడుకలకు దూరంగా ఉన్నాడు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయలేదు. చివరగా ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజు భార్య, కొడుకుతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు హార్దిక్ పాండ్య. ఆ తర్వాత నటాషాను ఉద్దేశించి ఎలాంటి ఫొటోలు, పోస్ట్‌లు చేయలేదు పాండ్య.
విడాకులపై క్లారిటీ...
అభిప్రాయభేదాల కారణంగా కలిసుండటం కష్టమని తేలడంతో హార్దిక్‌తో పాటు నటాషా డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇద్దరు కలిసి కోర్టును ఆశ్రయించినట్లు చెబుతోన్నారు. శనివారం (నేడు) వీరి విడాకులపై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
భరణంగా 70 శాతం ఆస్తులు...
హార్దిక్ పాండ్య విడాకులు ఇస్తే భరణం కింద అతడి ఆస్తుల్లోనే 70 శాతం తనకు, తన కొడుకుకు చెందాలని నటాషా విడాకుల నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. విడాకులు మంజూరు అయితే పాండ్య పెద్ద మొత్తంలో ఆస్తులను కోల్పోక తప్పదని సన్నిహిత వర్గాలు చెబుతోన్నాయి.
బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్...
సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిక్ బాలీవుడ్‌లో ప్రత్యేక గీతాల్లో ఎక్కువగా కనిపించింది. సత్యగ్రహి సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటాషా యాక్షన్ జాక్షన్, ఫక్రే రిటర్న్స్, ఫ్రైడే, జీరో, ది బాడీతో పాటు పలు సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసింది. బిగ్‌బాస్ హిందీ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. నాచ్ బలియే రియాలిషోలో థర్డ్ రన్నరప్‌గా నిలిచింది.
2020లో పెళ్లి...
ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో హార్దిక్ పాండ్యతో నటాషాకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2020 జనవరి 1న హార్దిక్, నటాషా పెళ్లి చేసుకున్నారు. 2020 జూలై 30న వీరికి బాబు పుట్టాడు. కుమారుడికి అగస్త అని పేరు పెట్టాడు హార్దిక్.