Team India Jersey: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీ అఫీషియల్‍గా లాంచ్: వీడియో.. జెర్సీ ఎలా ఉందంటే..
06 May 2024, 19:16 IST
- Team India Jersey - T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీ లాంచ్ అయింది. బ్లూ, ఆరెంజ్ కలర్ కాంబినేషన్‍లో ఈ జెర్సీ ఉంది. జెర్సీ లాంచ్ వీడియో చూసేయండి.
Team India Jersey: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీ అఫీషియల్‍గా లాంచ్: వీడియో.. జెర్సీ ఎలా ఉందంటే..
Team India Jersey: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ కోసం క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ నడుస్తుండగా.. ఆ తర్వాత జరిగే ప్రపంచకప్ మహా సంగ్రామం కోసం వేచిచూస్తున్నారు. జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ మెగాటోర్నీ జరగనుంది. ఈ తరుణంలో ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీ లాంచ్ అయింది. నేడు (మే 6) ఈ జెర్సీని ఆవిష్కరించింది బీసీసీఐ. లాంచ్ వీడియో బయటికి వచ్చింది.
జెర్సీ ఇలా..
టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీ.. బ్లూ, ఆరెంజ్ కలర్ల కాంబినేషన్‍తో రూపొందింది. జెర్సీ ఎక్కువ శాతం బ్లూ కలర్‌లో ఉండగా.. భుజాలపై ఆరెంజ్ కలర్ ఉంది. దీనిపై వైట్ స్ట్రిప్స్ ఉన్నాయి. కాలర్‌పై భారత జాతీయ పతాకంలా మూడు రంగులు ఉన్నాయి. జెర్సీ ఇరు వైపులా కూడా సైడ్‍కు ఆరెంజ్ కలర్‌లో లైన్ కనిపిస్తోంది. ఈసారి జెర్సీలో కాషాయ రంగు ఎక్కువగానే ఉంది. జెర్సీపై ఇండియా పేరు కూడా ఆరెంజ్ రంగులోనే ఉంది.
వీడియో ఇలా..
టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమిండియా జెర్సీ లాంచ్ వీడియోను బీసీసీఐ కిట్ స్పాన్సర్ అడిడాస్ వెల్లడించింది. ధర్మశాల స్టేడియంలో హెలీకాప్టర్ ద్వారా జెర్సీని ఆవిష్కరిస్తున్నట్టుగా ఈ వీడియో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా మరికొందరు భారత ఆటగాళ్లు.. ఆకాశంలో విహరిస్తున్న జెర్సీని చూస్తున్నట్టుగా ఈ వీడియో రూపొందింది.
మొత్తంగా.. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జెర్సీ ఆకర్షణీయంగా ఉంది. అయితే, కొన్ని రోజుల క్రితమే ఈ జెర్సీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఈ కొత్త జెర్సీపై భారత క్రికెట్ అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు జెర్సీ బాగుందంటే.. మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా జెర్సీలో కాషాయ రంగు ఎక్కువడంపై కొందరు అసంతృప్తి తెలుపుతున్నారు.
గ్రూప్ స్టేజీలో భారత మ్యాచ్‍లు
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 2 (అమెరికా కాలమానం ప్రకారం జూన్ 1) మొదలుకానుంది. జూన్ 29 వరకు సాగనుంది. 20 జట్లు నాలుగు గ్రూప్‍లుగా ఈ టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా ఉన్నాయి. ఈ మెగాటోర్నీలో జూన్ 5న తన వేటను టీమిండియా మొదలుపెట్టనుంది.
- భారత్ vs ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
- భారత్ vs పాకిస్థాన్ - జూన్ 9 (న్యూయార్క్)
- భారత్ vs అమెరికా - జూన్ 12 (న్యూయార్క్)
- భారత్ vs కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)
నాలుగు గ్రూప్‍ల్లో టాప్-2లో నిలిచే ఎనిమిది జట్లు సూపర్-8 దశకు చేరతాయి. ఆ తర్వాత నాలుగు టీమ్‍లు సెమీఫైనల్స్ చేరతాయి. సెమీఫైనల్స్ గెలిచిన జట్లు ఫైనల్‍లో తలపడతాయి.
గ్రూప్ దశలో అమెరికాలో ఆడనున్న భారత జట్టు.. సూపర్-8 చేరితే వెస్టిండీస్ గడ్డపై బరిలోకి దిగుతుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జరగనుంది.
భారత జట్టు ఇలా..
టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లతో ప్రధాన జట్టును వెల్లడించింది. నలుగురిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసుకుంది.
టీ20 ప్రపంచకప్ 2024కు భారత ప్రధాన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్‍దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
రిజర్వ్ ఆటగాళ్లు: రింకూ సింగ్, శుభ్‍మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్
టాపిక్