IND vs SL: శ్రీలంక చేరుకున్న రోహిత్ శర్మ, శ్రేయస్, కేఎల్ రాహుల్
29 July 2024, 8:29 IST
- IND vs SL: శ్రీలంకలో అడుగుపెట్టాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఆ దేశానికి చేరుకున్నారు. లంకతో వన్డే సిరీస్ ఆడేందుకు వారు కొలోంబో చేరారు.
IND vs SL: శ్రీలంక చేరుకున్న రోహిత్ శర్మ, శ్రేయస్, కేఎల్ రాహుల్
శ్రీలంక పర్యటనలో ప్రస్తుతం టీ20 సిరీస్‍లో భారత్ దుమ్మురేపుతోంది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో తొలి రెండు మ్యాచ్‍ల్లో గెలిచి టీ20 సిరీస్‍ను దక్కించుకుంది. 2-0తో ముందడుగు వేసి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను పక్కా చేసుకుంది భారత్. జూలై 30న టీమిండియా, శ్రీలంక మధ్య మూడో టీ20 జరగనుంది. ఆ తర్వాత ఆతిథ్య లంకతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది భారత్. ఆగస్టు 2న మొదలుకానున్న ఈ సిరీస్‍కు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నాడు. వన్డే సమరం కోసం లంకలో అడుగుపెట్టాడు రోహిత్.
కొలంబోకు రోహిత్ శర్మ
శ్రీలంకతో భారత్ టీ20 సిరీస్ పల్లెకెలెలో జరుగుతోంది. జూలై 30న చివరిదైన మూడో టీ20 ఉంటుంది. ఆ తర్వాత వన్డే సిరీస్‍లో మూడు మ్యాచ్‍లు కొలంబోలోనే జరగనున్నాయి. ఆగస్టు 2న తొలి వన్డే, ఆగస్టు 4న రెండో వన్డే, ఆగస్టు 7న మూడు వన్డేలో టీమిండియా, ఆతిథ్య లంక తలపడనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా కొలంబో చేరుకున్నాడు. రోహిత్‍తో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు.
కొలంబో ఎయిర్‌పోర్ట్‌కు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ చేరుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి. బ్లాక్, వైట్ కలర్ షేడ్స్ ఉన్న డ్రెస్ ధరించి.. బ్లాక్ క్యాప్‍తో రోహిత్ శర్మ కనిపించాడు. ఇటీవలే అమెరికాలో వెకెేషన్‍కు వెళ్లిన రోహిత్.. ఇప్పుడు లంక చేరుకున్నాడు. లంకతో వన్డే సిరీస్‍లో చోటు దక్కించుకున్న కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ కూడా కొలంబో చేరారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకా శ్రీలంక చేరాల్సి ఉంది. వన్డే సిరీస్ ఆరంభమయ్యేందుకు మరో నాలుగు రోజులు ఉంది. త్వరలోనే అతడు కోలంబో రానున్నాడు. హర్షిత్ రాణా కూడా త్వరలోనే జట్టుతో చేరనున్నాడు.
కాంట్రాక్ట్ కోల్పోయాక శ్రేయస్ తొలిసారి
భారత యంగ్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. గతేడాది వన్డే ప్రపంచకప్‍లో రాణించాడు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో అనూహ్యంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును అతడు కోల్పోయాడు. దేశవాళీ టోర్నీ ఆడేందుకు విముఖంగా ఉన్నందుకే అతడిపై బీసీసీఐ వేటు వేసిందనే వాదనలు వినిపించాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లోనూ శ్రేయస్‍కు చోటు దక్కలేదు. అయితే, కాంట్రాక్టు నుంచి వేటు పడ్డాక మళ్లీ ఇప్పుడు టీమిండియాలోకి వచ్చాడు శ్రేయస్.
ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించాక భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక నుంచి భారత్ తరఫున వన్డేలు, టెస్టులు ఆడాలని డిసైడ్ అయ్యాడు. దీంతో లంక టీ20 సిరీస్‍కు సూర్యకుమార్ యాదవ్‍ను సెలెక్టర్లు కెప్టెన్‍ను చేశారు. వన్డే సిరీస్‍కు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.
శ్రీలంకతో వన్డే సిరీస్‍కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్
టాపిక్