Rohit Sharma: ఆ దశలో ఏం చేయాలో అర్థం కాలేదు.. కానీ: ప్రపంచకప్ ఫైనల్‍పై రోహిత్ శర్మ లేటెస్ట్ కామెంట్లు
Rohit Sharma - T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍ను భారత కెప్టెన్ రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. డల్లాస్‍లో జరిగిన ఓ ఈవెంట్లో ఫైనల్ గురించి మాట్లాడాడు. ఓ సందర్భంలో అంతా బ్లాంక్ అయిందని తెలిపారు.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఓడిపోతుందనుకున్న దశ నుంచి చివరి ఐదు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికాపై తుదిపోరులో భారత్ గెలిచింది. జూన్ 27న జరిగిన ఫైనల్‍లో గెలిచి టీ20 ప్రపంచకప్ టైటిల్‍ను కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ గురించిన విషయాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. డల్లాస్‍లో తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో ఫైనల్ గురించి వెల్లడించాడు.
అంతా బ్లాంక్ అయింది
ఫైనల్‍లో దక్షిణాఫ్రికా గెలిచేందుకు 30 బంతులకు 30 పరుగులే చేయాల్సిన దశలో తన మైండ్ అంతా బ్లాంక్ అయిందని రోహిత్ శర్మ చెప్పాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదని అన్నాడు. కానీ, త్వరగానే ఆ స్థితి నుంచి బయటికి వచ్చి తమ ప్లాన్‍ను పకడ్బందీగా అమలు చేశామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో ప్రశాంతంగా ఉండి, ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రయత్నించామని రోహిత్ చెప్పాడు. “అవును, నేను అప్పుడు పూర్తిగా బ్లాంక్ అయ్యా. అయితే ఎక్కువ దూరం ఆలోచించకూడదని అనుకున్నా. ఆ స్థితి గురించి ఆలోచించి.. నా పనిపై ఫోకస్ చేసేందుకు ప్రయత్నించా. ప్రశాంతంగా ఉండి.. మేమంతా ప్లాన్‍లను అమలు చేయడం అప్పుడు చాలా ముఖ్యం. దక్షిణాఫ్రికా 30 బంతులకు 30 పరుగులే చేయాల్సిన దశలో మేమంతా చాలా ఒత్తిడిలో ఉన్నాం. అయినా మేం ఎంత కామ్‍గా ఉన్నామో చివరి ఐదు ఓవర్లు చూపించాయి. వేరే దేని గురించి ఆలోచించకుండా మేం ఏం చేయాలో అది చేశాం. మేం కంగారు పడలేదు. అదే మంచి చేసింది” అని రోహిత్ శర్మ అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో చివరి ఓవర్లలో భారత బౌలర్లు జస్‍ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ ముగ్గురూ కలిసి 22 పరుగులే ఇచ్చారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో 7 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
చివరి ఓవర్లు ఇలా..
16వ ఓవర్లో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దూకుడుగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్‍ను హార్దిక్ పాండ్యా ఆ తర్వాతి ఓవర్లో ఔట్ చేయడంతో టీమిండియా మళ్లీ గేమ్‍లో కమ్‍బ్యాక్ చేసింది. ఆ ఓవర్లోనూ హార్దిక్ నాలుగు పరుగులే ఇచ్చాడు. 18వ ఓవర్లో బుమ్రా ఓ వికెట్ తీసి కేవలం 2 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్లో అర్షదీప్ సింగ్ కూడా 4 పరుగులే ఇవ్వడంతో భారత్ పటిష్ట స్థితిలోకి వచ్చింది. చివర్లో ఓవర్లో దక్షిణాఫ్రికాకు 16 పరుగులు అవసరం కాగా.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్ తొలి బంతికి సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత హార్దిక్ ఒక్క బౌండరీ మాత్రమే ఇచ్చాడు. మొత్తంగా 7 పరుగుల తేడాతో ఫైనల్‍లో భారత్ అద్భుత విజయం సాధించింది.
17ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ పట్టింది. ఈ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున వన్డేలు, టెస్టులు ఆడనున్నాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు గుడ్‍బై చెప్పారు.