Rohit Sharma Retirement: రిటైర్మెంట్ ప్రసక్తే లేదు.. ఆ వరల్డ్ కప్ కూడా ఆడతా: రోహిత్ శర్మ
12 April 2024, 17:47 IST
- Rohit Sharma Retirement: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రసక్తే లేదని చెబుతున్నాడు. పరోక్షంగా 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ కూడా ఆడతాననే హింట్ ఇవ్వడం విశేషం.
రిటైర్మెంట్ ప్రసక్తే లేదు.. ఆ వరల్డ్ కప్ కూడా ఆడతా: రోహిత్ శర్మ
Rohit Sharma Retirement: తన వరల్డ్ కప్ కల నెరవేరకుండా రిటైరయ్యే ప్రసక్తే లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. 37 ఏళ్ల రోహిత్ ఇక రిటైర్మెంట్ కు దగ్గర పడ్డాడని, ఎక్కువ కాలం ఆడటం కష్టమే అన్న అభిప్రాయాల మధ్య అతడు ఈ చర్చపై స్పందించాడు. తనకు వరల్డ్ కప్ గెలవాలని ఉందని అతడు స్పష్టం చేశాడు.
వన్డే వరల్డ్ కప్.. తీరని కల
రోహిత్ శర్మ 2007లోనే టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్ లో సభ్యుడు. కానీ 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత ఈ మెగా టోర్నీ గెలిచే అవకాశం అతనికి రాలేదు. గతేడాది టాప్ ఫామ్ లో ఫైనల్ వరకూ దూసుకొచ్చినా.. టీమిండియాకు ఆస్ట్రేలియా చెక్ పెట్టింది. ఈ నేపథ్యంలో రోహిత్ వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోయిందని అందరూ భావించారు.
కానీ తాజాగా 2027లో సౌతాఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్ కూడా ఆడతాను అన్నట్లుగా రోహిత్ మాట్లాడాడు. యాంకర్ గౌరవ్ కపూర్ తో బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో పాల్గొన్న రోహిత్ ఇలా స్పందించాడు. "రిటైర్మెంట్ గురించి నిజంగా నేను ఆలోచించడం లేదు. కానీ జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఇప్పటికీ నేను బాగానే ఆడుతున్నాను. మరి కొన్నేళ్ల పాటు ఆడతాననే అనుకుంటున్నాను. ఆ తర్వాత తెలియదు. వరల్డ్ కప్ గెలవాలని అనుకుంటున్నాను. 2025లో డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఉంది. ఇండియా ఫైనల్ చేరుతుందని ఆశిస్తున్నా" అని రోహిత్ అన్నాడు.
గతేడాది రోహిత్ కెప్టెన్సీలోనే ఇండియన్ టీమ్ డబ్ల్యూటీసీ ఫైనల్ తోపాటు వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఓడిపోయింది. ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉంది. అందులో టీమిండియాను రోహిత్ శర్మనే లీడ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది మిస్సయిన వన్డే వరల్డ్ కప్ కలను ఈసారి టీ20 వరల్డ్ కప్ రూపంలో రోహిత్ తీర్చుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
రోహిత్ శర్మ ఫ్యూచర్ ఏంటి?
ఐపీఎల్లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడు మహా అయితే మరో రెండు సీజన్ల పాటు ఈ మెగా లీగ్ లో కొనసాగే అవకాశం ఉంది. ఇక నేషనల్ టీమ్ విషయానికి వస్తే ఇప్పటికీ మూడు ఫార్మాట్లలోనూ అతడే కెప్టెన్. ఈ ఏడాది జనవరిలో చాలా రోజుల తర్వాత మరోసారి టీ20 టీమ్ కు కూడా అతని కెప్టెన్సీలోనే ఆఫ్ఘనిస్థాన్ తో ఇండియా తలపడింది.
దీంతో టీ20 వరల్డ్ కప్ కు కెప్టెన్ అతడే అని బీసీసీఐ చెప్పకనే చెప్పింది. బోర్డు కార్యదర్శి జై షా అయితే అతని నేతృత్వంలో కప్పు గెలవాలంటూ పరోక్షంగా కెప్టెన్ ను అనౌన్స్ చేసేశాడు. ఇక ఇప్పుడు అతడు ఆ మెగా టోర్నీలో టీమ్ ను ఎలా గెలిపించాలన్నదానిపైనే దృష్టి సారించడం మిగిలింది. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు ఈ టోర్నీ జరగనుంది.