Rohit Sharma: లక్నో సూపర్ జెయింట్స్‌కు రోహిత్ శర్మ.. ఆ టీమ్ కోచ్ లాంగర్ కామెంట్స్ వైరల్
Rohit Sharma: రోహిత్ శర్మను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేయనుందా? అతడు మెగా వేలంలో పాల్గొంటాడా? ఈ ప్రశ్నలకు లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ సమాధానం ఇచ్చాడు.
Rohit Sharma: ఐపీఎల్ 2024 ప్రారంభమైనప్పటి నుంచీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ ఫ్రాంఛైజీని వదిలేస్తాడని, వచ్చే మెగా వేలంలో పాల్గొంటాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ అయితే ఓ అడుగు ముందుకేసి తామే అతన్ని కొనుగోలు చేస్తామని చెప్పడం గమనార్హం.
రోహిత్ శర్మపై ఎల్ఎస్‌జీ కన్ను
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించినప్పటి నుంచీ రోహిత్ ఇక ఆ టీమ్ కు గుడ్ బై చెబుతాడన్న వార్తలు వచ్చాయి. ఆ టీమ్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు దీనిపై స్పందిస్తూ.. అతడు చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లాలని సూచించాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతనిపై ఆసక్తి చూపుతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ రేసులోకి వచ్చింది.
తాము తీసుకోవాలనుకుంటున్న ఒక్క ప్లేయర్ గురించి చెప్పాల్సిందిగా ఆ టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్ ను ప్రశ్నిస్తూ.. రోహిత్ శర్మ అయితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీనిపై లాంగర్ స్పందిస్తూ చాలా ఉత్సాహం చూపించాడు. "నాకు కావాల్సిన ఓ ప్లేయరా? మీ దగ్గర ఎవరైనా ఉంటే అది ఎవరని మీరు అనుకుంటున్నారు" అని లాంగర్ ప్రశ్నించాడు.
సదరు ఇంటర్వ్యూయర్ రోహిత్ శర్మ పేరు చెప్పాడు. "రోహిత్ శర్మనా? హ హ హ.. అతన్ని మేము ముంబై నుంచి తీసుకుంటాం. కానీ నువ్వే మధ్యవర్తిగా ఉండాలి" అని లాంగర్ అన్నాడు. ఈ ఏడాది చివర్లో ఐపీఎల్ 2025 కోసం మరోసారి మెగా వేలం జరగనుంది. దీనిపై బీసీసీఐ కూడా ఫ్రాంఛైజీ ఓనర్లతో చర్చించనుంది. అయితే ఒక్కో టీమ్ కు ఎంత మంది ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునే అవకాశం ఇస్తారన్నదానిపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది.
గతంలో 2022లో మెగా వేలం జరిగినప్పుడు నలుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకోవడంతోపాటు ఒక రైట్ టు మ్యాచ్ కార్డు అవకాశాన్ని ఫ్రాంఛైజీలకు ఇచ్చారు. అయితే ఫ్రాంఛైజీలు మాత్రం ఈ నంబర్ ను కాస్త పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ లెక్కన నలుగురు ప్లేయర్స్ అంటే ముంబై ఇండియన్స్ కచ్చితంగా హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ లను రిటెయిన్ చేసుకోవడం ఖాయం. ఆ నాలుగో ప్లేయర్ రోహిత్ అవుతాడా లేదా అన్నదే ఆసక్తికరం.
రోహిత్ శర్మ ఏం చేయబోతున్నాడు?
రోహిత్ శర్మ వయసు ఇప్పటికే 37 ఏళ్లు. ఇక ఎక్కువ రోజులు క్రికెట్ లో కొనసాగడం డౌటే. మహా అయితే ఒకటో, రెండో సీజన్లలో మాత్రమే అతడు కనిపించనున్నాడు. ఇప్పటికే ఐపీఎల్లో రోహిత్ నుంచి మెరుపు కనుమరుగయ్యాయి. 2022లో 268 రన్స్, గతేడాది 332 రన్స్ మాత్రమే చేశాడు. కెప్టెన్ గానూ గత మూడు సీజన్లలో ముంబైని గెలిపించకపోవడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారు.
దీనిపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నట్లు అతని భార్య రితికా గతంలో చేసిన ఓ కామెంట్ ను బట్టి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అతని భవిష్యత్తు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ తోనే ఉంటాడా లేక మెగా వేలంలోకి వెళ్తాడా అన్నది చూడాలి. ఒకవేళ వేలంలోకి వెళ్తే మాత్రం అతని కోసం ప్రతి ఫ్రాంఛైజీ పోటీ పడుతుందనడంలో సందేహం లేదు.