Team India Schedule: ఓపెన్ బస్ పరేడ్, ప్రధానితో మీటింగ్, సక్సెస్ పార్టీ.. టీ20 వరల్డ్ కప్ విజేతల బిజీ షెడ్యూల్
03 July 2024, 14:47 IST
- Team India Schedule: టీ20 వరల్డ్ కప్ విన్నర్స్ టీమిండియా స్వదేశంలో అడుగుపెట్టగానే బిజీబిజీగా గడపనుంది. ఓపెన్ బస్ పరేడ్, పీఎంతో మీటింగ్, సెలబ్రేషన్స్ తో రోహిత్ అండ్ టీమ్ బిజీ కానుంది.
ఓపెన్ బస్ పరేడ్, ప్రధానితో మీటింగ్, సక్సెస్ పార్టీ.. టీ20 వరల్డ్ కప్ విజేతల బిజీ షెడ్యూల్
Team India Schedule: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బార్బడోస్ లో హరికేన్ కారణంగా ఇప్పటి వరకూ స్వదేశంలో అడుగుపెట్టలేదు. గురువారం (జులై 4) తెల్లవారుఝామున రానున్నట్లు చెబుతున్నారు. అయితే టీమ్ వచ్చీ రాగానే బీసీసీఐ భారీ షెడ్యూలే ప్లాన్ చేసింది. ప్రధానితో మీటింగ్, ఓపెన్ బస్ పరేడ్ లాంటివి ఇందులో ఉన్నాయి.
టీమిండియా షెడ్యూల్ ఇదీ..
టీమిండియా బార్బడోస్ లో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం (జులై 3) మధ్యాహ్నం బయలుదేరనుంది. ఇండియాకు గురువారం ఉదయం 6 గంటలకు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రానుంది. ఆ తర్వాత ఢిల్లీలోనే కాస్త బ్రేక్ తీసుకున్న తర్వాత నేరుగా ప్రధాని మోదీని కలవడానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి ముంబై వెళ్లి ఓపెన్ బస్ పరేడ్ లో పాల్గొంటారు.
- బార్బడోస్ నుంచి గురువారం (జులై 4) ఉదయం 6 గంటలకు టీమ్ ఢిల్లీలో ల్యాండ్ కానుంది
- ఆ తర్వాత ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి వెళ్తుంది.
- మోదీతో మీటింగ్ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్తుంది
- ముంబై ఎయిర్ పోర్టు నుంచి వాంఖెడే స్టేడియం దగ్గరికి జట్టును తీసుకెళ్తారు
- వాంఖెడే స్టేడియం నుంచి కిలోమీటర్ వరకు ఓపెన్ బస్ పరేడ్ నిర్వహించనున్నారు
- వాంఖెడే స్టేడియంలో సెలబ్రేషన్స్. వరల్డ్ కప్ ట్రోఫీని బీసీసీఐ సెక్రటరీ జై షాకి అందజేయనున్న రోహిత్ శర్మ
- సాయంత్రం వాంఖెడే నుంచి టీమిండియా ప్లేయర్స్ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోనున్నారు
చార్టర్ విమానంలో రానున్న టీమిండియా..
దీనికంటే ముందు 2011లో చివరిసారి ఇండియా ఓ వరల్డ్ కప్ గెలిచింది ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనే. దీంతో ఆ స్టేడియం చుట్టే టీమిండియా విక్టరీ పరేడ్ ను ఏర్పాటు చేశారు. నిజానికి గత శనివారమే (జూన్ 29) వరల్డ్ కప్ ఫైనల్ ముగిసినా.. బార్బడోస్ లో హరికేన్ కారణంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. రెండు రోజుల పాటు అక్కడి ఎయిర్ పోర్టును మూసేశారు.
దీంతో బీసీసీఐ ప్రత్యేకంగా ఎయిరిండియా బోయింగ్ 777 విమానాన్ని టీమ్ కోసం పంపించింది. ఈ ప్రత్యేక విమానంలోనే టీమ్ తోపాటు వాళ్ల కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు ఇండియాకు తిరిగి రానున్నారు. ఇప్పటికే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ ఏకంగా రూ.125 కోట్ల ప్రత్యేక ప్రైజ్ మనీని ప్రకటించిన విషయం తెలిసిందే.