Rohit Sharma: అందుకే ఆ మట్టి తిన్నాను: వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తాను అలా ఎందుకు చేశాడో వివరించిన రోహిత్ శర్మ
Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అక్కడి పిచ్ పై ఉన్న మట్టిని తీసి తినడం ఆశ్చర్యం కలిగించింది. అయితే తాజాగా బీసీసీఐ రిలీజ్ చేసిన వీడియోలో దాని వెనుక కారణమేంటో అతడు వివరించాడు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు టీ20 వరల్డ్ కప్ లు గెలిచిన జట్టులో ఉన్న ఏకైక ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. గతేడాది మిస్సయిన వన్డే వరల్డ్ కప్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ రూపంలో అందడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు. అందులో భాగంగానే తమకు విజయాన్ని అందించిన పిచ్ పై ఉన్న మట్టిని తిన్నాడతడు. ఆ సమయంలో తాను అలా ఎందుకు చేశానో తాజా వీడియోలో రోహిత్ వివరించాడు.
ఆ మట్టిని అందుకే తిన్నాను
ఈ చిరస్మరణీయ విజయం తర్వాత టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ చేసుకున్న సంబరాలు, తన ఫీలింగ్స్ వివరించే వీడియోను బీసీసీఐ మంగళవారం (జులై 2) రిలీజ్ చేసింది. ఇందులో ఈ విజయం తనలో రేకెత్తించిన ఫీలింగ్స్ ను రోహిత్ పంచుకున్నాడు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్, 13 ఏళ్ల తర్వాత ఓ క్రికెట్ వరల్డ్ కప్, 11 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీని టీమిండియాకు అందించిన రోహిత్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు.
"మాకు ఆ విజయాన్ని సాధించి పెట్టిన ఆ పిచ్ దగ్గరికి వెళ్లినప్పుడు నాలో అదే ఆలోచన మెదిలింది. అదే పిచ్ పై ఆడి మేము గెలిచాము. నేను నా జీవితంలో ఆ గ్రౌండ్, ఆ పిచ్ ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. అందుకే ఆ పిచ్ లో కొంత భాగాన్ని నాతో పాటు తీసుకురావాలన్న ఉద్దేశంతో అలా చేశాను. ఆ క్షణాలు చాలా చాలా ప్రత్యేకం. మా కలలన్నీ నిజమైన ప్లేస్ అది. అలా చేయడం వెనుక నా ఉద్దేశం అదే" అని ఆ వీడియోలో రోహిత్ వివరించాడు.
అన్నీ అలా జరిగిపోయాయి: రోహిత్
టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇప్పటికీ తనకు కలగానే ఉందని, అసలు అలా జరగలేదేమో అనిపిస్తోందని రోహిత్ ఈ వీడియోలో అనడం విశేషం. "గెలిచిన తర్వాత క్షణాలను నేను మాటల్లో వర్ణించలేను. ఏదీ ముందుగా అనుకొని చేసింది కాదు. అప్పటికప్పుడు అలా చేస్తూ వెళ్లిందే. ఈ ఫీలింగ్ చాలా అద్భుతం. ఇంకా ఆ క్షణాన్ని పూర్తిగా మరచిపోలేకపోతున్నాను. ఓ గొప్ప క్షణమది" అని రోహిత్ అన్నాడు.
కపిల్ దేవ్, ధోనీ తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ రోహిత్ శర్మ. గెలిచిన రోజు తాను అసలు నిద్ర పోలేదని అతడు చెప్పాడు. "అదంతా కలగానే ఉంది. ఆ సమయంలో కలిగిన ఫీలింగ్ అదే. ఎన్నో ఏళ్లుగా దీని గురించి కల కన్నాము. ఓ జట్టుగా చాలా కష్టపడ్డాం. మొత్తానికి దానిని సాధించాం. కష్టపడి సాధించిన తర్వాత కలిగే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ రాత్రి అసలు పడుకోనేలేదు. అయినా నాకేమీ అనిపించడం లేదు. ఇంటికెళ్లిన తర్వాత అదే పని చేస్తాను" అని రోహిత్ అన్నాడు.
వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరుసటి రోజు తెల్లవారుఝాము వరకు తనతోపాటు టీమ్మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు. ఈ వరల్డ్ కప్ గెలవగానే అతడు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఫార్మాట్లో కొత్త కెప్టెన్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. హార్దిక్, సూర్యలలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది.