Team India: భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతి.. ఐసీసీ ప్రైజ్‍మనీ కంటే 600 శాతం ఎక్కువ
Team India T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతి ప్రకటించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నజరానా ఇస్తోంది. ఐసీసీ ప్రైజ్‍మనీ కన్నా ఆరు రెట్లకు మించి భారత జట్టుకు బీసీసీఐ ఇవ్వనుంది.
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించి టీమిండియా అదరగొట్టింది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ టీ20 విశ్వవిజేతగా నిలిచింది. 2007 తర్వాత మళ్లీ టీ20 టైటిల్ పట్టింది. బార్బొడోస్ వేదికగా శనివారం (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. ఈ టైటిల్ సాధించిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతి ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా నేడు (జూన్ 30) వెల్లడించారు.
రూ.125కోట్ల నజరానా
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన భారత జట్టుకు ఏకంగా రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది. “ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ గెలిచిన భారత జట్టుకు రూ.125కోట్ల ప్రైజ్‍మనీ ప్రకటిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. టోర్నమెంట్ మొత్తం అసాధారణమైన ప్రతిభ, అంకితభావం, క్రీడాస్ఫూర్తిని, నైపుణ్యాలను జట్టు ప్రదర్శించింది. అద్భుత విజయాన్ని సాధించిన ఆటగాళ్లు కోచ్‍లు, సహాయకసిబ్బంది అందరికీ అభినందనలు” అని జై షా నేడు ట్వీట్ చేశారు.
టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన టీమిండియాకు రికార్డు స్థాయిలో బీసీసీఐ నగదు బహుమతి ప్రకటించింది. గతంలో ఎప్పుడూ ఈస్థాయిలో రూ.125కోట్ల నజరానా ఇవ్వలేదు.
ఐసీసీ ప్రైజ్‍మనీ కంటే ఆరు రెట్లు
టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20.42 కోట్లు) అందజేసింది ఐసీసీ. అయితే, బీసీసీఐ అంతకు 600 శాతం (ఆరు రెట్లు) కంటే ఎక్కువ బహుమతిని తన జట్టు టీమిండియాకు ఇచ్చింది. ఏకంగా రూ.125కోట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఉంది.
దక్షిణాఫ్రికాపై ఫైనల్ గెలిచాక భారత కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ అందించారు జై షా. లియోనెల్ మెస్సీ స్టైల్‍లో నడుకుంటూ వచ్చి టైటిల్ అందుకున్నాడు రోహిత్. భారత ఆటగాళ్లతో కలిసి జై షా కూడా సంబరాలు చేసుకున్నారు. ప్లేయర్లను కౌగిలించుకున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అజేయంగా నిలిచింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు కూడా సృష్టించింది.
దక్షిణాఫ్రికాపై ఫైనల్‍లో భారత్ 7 పరుగుల తేడాతో ఉత్కంఠ పోరులో గెలిచింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత అర్ధ శకతం చేశాడు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులే చేసి ఓడింది. ఓ దశలో సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులే అవసరం అయ్యాయి. టీమిండియా ఆశలు సన్నగిల్లాయి. ఆ తరుణంలో జస్‍ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‍ను గెలిపించారు. చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి మ్యాచ్‍ను మలుపు తిప్పాడు.