World cup Winners: వరల్డ్ కప్ కోసం ఎదురు చూపులు.. మరింత ఆలస్యంగా రానున్న టీమిండియా.. ఏం జరిగింది?
World cup Winners: టీమిండియా గెలిచిన వరల్డ్ కప్ ఎప్పుడు ఇంటికి వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే బార్బడోస్ లో తుఫానులో చిక్కుకుపోయిన ఇండియన్ ప్లేయర్స్ రాక మరింత ఆలస్యం కానుంది.
World cup Winners: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి నాలుగు రోజులు గడిచిపోయాయి. అయినా ఇప్పటి వరకూ ఆ వరల్డ్ కప్ హీరోలు ఇంకా మన దేశంలో అడుగుపెట్టలేదు. బుధవారం (జులై 3) రాత్రికి వస్తున్నారని మొదట వార్తలు వచ్చినా.. ఇప్పుడది మరింత ఆలస్యం కానుంది. వరల్డ్ కప్ ముగిసిన రోజు నుంచే క్రికెటర్లు, బీసీసీఐ అధికారులతోపాటు మొత్తం 70 మంది ఇండియన్స్ బార్బడోస్ లోనే చిక్కుకున్నారు.
టీమిండియా వచ్చేది ఎప్పుడు?
జూన్ 29న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఈ ఫార్మాట్లో టీమిండియా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే అప్పటి నుంచీ వాళ్లతోపాటు వాళ్లు గెలుచుకున్న ట్రోఫీ కూడా అక్కడే ఉండిపోయింది. రెండు రోజులుగా బార్బడోస్ ఎయిర్ పోర్టును మూసేశారు. బుధవారం (జులై 3) ఉదయమే మళ్లీ తెరిచారు. అయినా ఇండియన్ టీమ్ మాత్రం తమ విమానం కోసం ఇంకా నిరీక్షించాల్సి వస్తోంది.
ప్లేయర్స్ ను తీసుకురావడానికి బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చార్టర్ ఫ్లైట్ బుధవారం తెల్లవారుఝామున 3 గంటలకు బార్బడోస్ చేరాల్సి ఉన్నా.. అది కాస్తా నాలుగు గంటలు ఆలస్యం కానుంది. దీంతో బుధవారం రాత్రికల్లా ఇండియాలో అడుగుపెడతారని భావించినా.. ఇప్పుడు గురువారం (జులై 4) తెల్లవారుఝామునే వాళ్లు వచ్చే అవకాశం ఉంది.
నిజానికి వరల్డ్ కప్ ముగిసిన తర్వాత బార్బడోస్ నుంచి అమెరికా వెళ్లి అక్కడి నుంచి యూఏఈ మీదుగా ఇండియా రావాలన్నది అసలు ప్లాన్. కానీ హరికేన్ వల్ల రెండు రోజులు విమానాలు రద్దవడంతో ప్లాన్ మారింది. బీసీసీఐ ప్రత్యేకంగా చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసి మరీ ప్లేయర్స్, వాళ్లు కుటుంబ సభ్యులను తిరిగి ఇండియాకు తీసుకురానుంది. గురువారం ఉదయం 5 గంటలకు ఈ విమానం వచ్చే అవకాశం ఉంది.
కప్పు వచ్చేస్తోంది అంటూ..
మరోవైపు బుధవారం ఉదయమే బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో వరల్డ్ కప్ ట్రోఫీని చూపిస్తూ.. ఇది ఇంటికి వచ్చేస్తోంది అనే క్యాప్షన్ ఉంచింది. టీమ్ ఇండియాకు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్లేయర్స్ ను సన్మానించనున్నారు. అయితే అది ఎప్పుడన్నది ఇంకా వెల్లడించలేదు. టీమ్ వరల్డ్ కప్ గెలవగానే ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బార్బడోస్ ను హరికేన్ వణికిస్తోంది. సోమవారం (జులై 1) నుంచి బలమైన గాలులు, వర్షాలతో బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచే 3 లక్షల జనాభా ఉన్న ఆ చిన్న ద్వీపాన్ని పూర్తిగా మూసేశారు. అప్పటి నుంచి ఇండియన్ టీమ్ అక్కడే చిక్కుకుపోగా.. వాళ్లను తీసుకురావడానికి బీసీసీఐ ప్రయత్నిస్తూనే ఉంది.