T20 World Cup 2024: ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ - పసికూన చేతిలో ఓటమి తప్పించుకున్న సౌతాఫ్రికా
09 June 2024, 8:16 IST
T20 World Cup 2024: సౌతాఫ్రికాను పసికూన నెదర్లాండ్స్ భయపెట్టింది నెదర్లాండ్స్ విధించిన 103 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా చెమటోడ్చి ఛేదించి విజయాన్ని అందుకున్నది. మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.
టీ20 వరల్డ్ కప్
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంచనాలకు మించి సాగుతోంది. ఈ వరల్డ్ కప్‌లో పసికూనలుగా బరిలో దిగిన నెదర్లాండ్స్, అమెరికాతో పాటు ఇతర టీమ్‌లు అద్భుత ఆటతీరుతో అదగొడుతోన్నాయి. అగ్ర జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
శనివారం నెదర్లాండ్స్‌పై చెమటోడ్చి సౌతాఫ్రికా విజయాన్ని అందుకున్నది. 106 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ అష్టకష్టాలు పడ్డారు. ఒకానొకదశలో సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో ఓడిపోయేలా కనిపించింది. క్రీజులో పాతుకుపోయిన డేవిడ్ మిల్లర్ సౌతాఫ్రికా పరువును కాపాడాడు.
103 పరుగులు మాత్రమే...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 103 పరుగులు మాత్రమే చేసింది. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్స్‌లో సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెంచ్ 40 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. చివరలో వాన్‌బీక్ 23 పరుగులతో రాణించడంతో నెదర్లాండ్స్ స్కోరు వంద పరుగులు దాటింది. సౌతాఫ్రికా బౌలర్లలో బార్ట్‌మన్ నాలుగు ఓవర్లు వేసి 11 రన్స్ మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. జాన్సెన్, నోర్జ్ తలో రెండు వికెట్లు తీశారు.
సున్నా పరుగులకే తొలి వికెట్...
104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా ఈజీగా ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని అనుకున్నారు. సున్నా పరుగులకే సౌతాఫ్రికా వికెట్ తీసి తమతో పోరు అంత ఈజీగా కాదని నెదర్లాండ్స్ చాటిచెప్పింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే డికాక్ రనౌట్ అయ్యాడు.
జట్టు స్కోరు మూడు పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మార్‌క్రమ్ డకౌట్ కాగా...హెండ్రిక్స్ మూడు పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. క్లాసెన్ కూడా త్వరగా ఔట్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
12 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో సౌతాఫ్రికాను ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ గెలిపించారు. డేవిడ్ మిల్లర్ 51 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 59 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉన్నాడు. స్టబ్స్ 33 పరుగులు చేశాడు. 18.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకున్నది సౌతాఫ్రికా.
దంచికొట్టిన ఆస్ట్రేలియా...
మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ సమిష్టిగా మ్యాచ్‌లో రాణించారు. వార్నర్ 39(16 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు), ట్రావిస్ హెడ్ 34, మార్ష్ 35, స్టోయినిస్ 30 పరుగులతో ఆకట్టుకున్నారు. మాక్స్‌వెల్ 28 రన్స్ చేశాడు. వీరిందరి మెరుపులతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది.
ఆరంభం అదిరినా...
లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఇరవై ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేసింది. జోస్ బట్లర్ 28 బాల్స్‌లో 42 రన్స్, ఫిలిప్ సాల్ట్ 23 బాల్స్ 37 రన్స్‌తో ఇంగ్లండ్‌కు చక్కటి ఆరంభాన్ని అందించారు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. మెయిన్ అలీ (25 రన్స్), హ్యారీ బ్రూక్ (20 రన్స్) ధాటిగా ఆడలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, జంపా తలో రెండు వికెట్లు తీశారు.