Nitish Kumar Reddy: వార్నర్ ఏడేళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన నితీష్‌కుమార్ రెడ్డి - తెలుగు క్రికెటర్‌పై ప్రశంసలు
Nitish Reddy ipl 2024: గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలన బ్యాటింగ్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టిన నితీష్ అరుదైన రికార్డును సమం చేశాడు.
Nitish Reddy ipl 2024: గురువారం సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బాల్ వరకు క్రికెట్ అభిమానులకు ఉత్కంఠను పంచింది. ఈ మ్యాచ్‌లో ఒక్క రన్ తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టెక్కింది. చివరి ఓవర్‌లో అద్భుత బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ను గెలిపించాడు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.
నితీష్ సంచలన బ్యాటింగ్...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలన బ్యాటింగ్‌తో హైదరాబాద్‌కు భారీ స్కోరు అందించాడు. సిక్సర్లతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
రికార్డ్ సమం...
42 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు, మూడు ఫోర్లతో నితీష్ రెడ్డి 76 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డును సమం చేశాడు నితీష్ రెడ్డి. ఒకే మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టిన ఐదో సన్‌రైజర్స్ ప్లేయర్‌గా నితీష్ కుమార్ రెడ్డి రికార్డ్ నెలకొల్పాడు. అతడి కంటే ముందు డేవిడ్ వార్నర్ (2017లో కేకేఆర్‌పై), మనీష్ పాండే (2020లో రాజస్థాన్ రాయల్స్)పై ఈ ఘనతను సాధించారు. వారితో పాటు హెన్రిచ్ క్లాసెన్ (కేకేఆర్ పై), ట్రావిస్ హెడ్ (ఆర్‌సీబీపై) కూడా ఇదే సీజన్‌లో ఎనిమిది సిక్సర్లతో రికార్డ్ క్రియేట్ చేశారు. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌తో ఈ నలుగురి క్రికెటర్ల సరసన నితీష్ కుమార్ రెడ్డి చేరాడు.
చాహల్ బౌలింగ్‌లో...
నితీష్ ధనాధన్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురుస్తోన్నాయి. ముఖ్యంగా స్పిన్నర్ చాహల్ వేసిన ఓవర్‌లో నితీష్ కుమార్ రెడ్డి రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. ఆ ఓవర్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది.
2024లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో చెలరేగడమే కాకుండా బౌలింగ్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఏడు మ్యాచుల్లో 54.75 యావరేజ్, 154. 22 స్ట్రైక్ రేట్‌తో నితీష్ రెడ్డి 219 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతే కాకుండా బౌలింగ్‌లో ఇప్పటివరకు మూడు వికెట్లు తీసుకున్నాడు. వికెట్లు ఎక్కువగా తీయకున్నా పరుగుల్ని మాత్రం నియంత్రిస్తున్నాడు.
నాలుగో స్థానంలో సన్‌రైజర్స్...
సన్‌రైజర్స్ చేతిలో ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లోనే కొనసాగుతోంది. ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఇది రెండో ఓ టమి పాత్రమే. మొత్తం పది మ్యాచుల్లో ఎనిమిది విజయాలతో పదహారు పాయింట్స్ సాధించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నది. రాజస్థాన్‌పై విజయంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి చేరుకుంది. పది మ్యాచుల్లో ఆరు విజయాలు, నాలుగు ఓటములతో 12 పాయింట్లను సొంతం చేసుకున్నది