KL Rahul Catch: ఆస్ట్రేలియాకి గబ్బా టెస్టులో శాపంగా మారిన స్టీవ్‌స్మిత్ చిన్న తప్పిదం.. భారత్ జట్టుకి వరం
17 December 2024, 14:53 IST
India vs Australia 3rd Test: గబ్బా టెస్టులో కేఎల్ రాహుల్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను స్టీవ్‌స్మిత్ నేలపాలు చేశాడు. ఆ క్యాచ్ ఖరీదు 51 పరుగులు. ఈ రన్స్ ఆస్ట్రేలియాకి మ్యాచ్‌ను దూరం చేస్తే.. భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశాయి.
స్టీవ్‌స్మిత్
భారత్‌తో బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో స్టీవ్‌స్మిత్ చేసిన చిన్న తప్పిదం ఆస్ట్రేలియా జట్టుకి శాపంగా మారింది. మ్యాచ్‌లో నాలుగో రోజైన మంగళవారం ఆట మొదటి బంతికే ఆస్ట్రేలియా జట్టుకు వికెట్ దక్కే అవకాశం లభించింది. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. సింపుల్‌గా స్లిప్‌లో స్టీవ్‌స్మిత్‌కి క్యాచ్ ఇచ్చాడు. కానీ.. సులువుగా అందుకోవాల్సిన క్యాచ్‌ను తత్తరపాటులో స్టీవ్‌స్మిత్ నేలపాలు చేశాడు.
రాహుల్ వికెట్ చేజారింటే?
ఆ క్యాచ్ చేజారినప్పుడు కేఎల్ రాహుల్ స్కోరు 33 పరుగులుకాగా.. ఈరోజు ఔట్ అయ్యే సమయానికి అతను 139 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. భారత్ జట్టులో కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్‌కాగా.. ఈరోజు ఒకవేళ మొదటి బంతికే అతను ఔట్ అయ్యి ఉంటే.. మ్యాచ్‌పై టీమిండియా కచ్చితంగా పట్టుకోల్పోయేది.
కొంపముంచిన ఉదాసీనత
వాస్తవానికి స్టీవ్‌స్మిత్ మంచి ఫీల్డర్. మరీ ముఖ్యంగా టెస్టుల్లో అతను స్లిప్‌లో అద్భుతంగా క్యాచ్‌లు పడుతుంటాడు. కానీ.. ఈరోజు ఆట ఆరంభంలోనే కావడంతో కాస్త ఉదాసీనంగా ఉన్నట్లు కనిపించింది. దాంతో మంచి క్యాచింగ్ పొజీషన్‌లో బంతి చేతుల్లోకి వెళ్లినా.. దాన్ని ఒడిసి పట్టుకోలేకపోయాడు. అయితే.. ఎట్టకేలకి కేఎల్ రాహుల్ క్యాచ్‌ని మరోసారి స్లిప్‌లోనే స్టీవ్‌స్మిత్ అందుకున్నాడు.
ఒంటిచేత్తో క్యాచ్ పట్టిన స్మిత్
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో బంతిని కట్ చేసేందుకు కేెఎల్ రాహుల్ ప్రయత్నించాడు. షాట్ అతను ఆశించిన విధంగానే కనెక్ట్ అయ్యింది. కానీ స్లిప్‌లో తన పక్క నుంచి గాల్లో వెళ్తున్న బంతిని పక్కకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టీవ్‌స్మిత్ క్యాచ్‌గా అందుకున్నాడు. దాంతో కేఎల్ రాహుల్‌కి సెంచరీ చేజారింది. కానీ.. స్టీవ్‌స్మిత్ తప్పిదం ఖరీదు.. 51 పరుగులు. ఒకవేళ కేఎల్ రాహుల్ 33 పరుగుల వద్ద ఔట్ అయిపోయి ఉండి ఉంటే.. భారత్ కచ్చితంగా ఫాలోఆన్ ఆడాల్సి వచ్చేది.
డ్రా దిశగా మ్యాచ్
మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 252/9తో నిలవగా.. క్రీజులో జస్‌ప్రీత్ బుమ్రా (10 బ్యాటింగ్), ఆకాశ్ దీప్ (27 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ జట్టు ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులు వెనకబడి ఉంది. ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో ఇక బుధవారం ఆట మాత్రమే మిగిలి ఉండటంతో డ్రా అయ్యే ఛాన్స్ ఎక్కువ. అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం లేదు.