SA vs NEP T20 World Cup 2024: నేపాల్‌పై కిందామీదా పడి పరుగు తేడాతో గెలిచిన సౌతాఫ్రికా
15 June 2024, 8:51 IST
- SA vs NEP T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో దారుణమైన ఓటమి నుంచి తప్పించుకుంది సౌతాఫ్రికా. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో నేపాల్ ను ఓడించి ఊపిరి పీల్చుకుంది.
నేపాల్‌పై కిందామీదా పడి పరుగు తేడాతో గెలిచిన సౌతాఫ్రికా
SA vs NEP T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లో నేపాల్ ఓ సంచలన విజయానికి చేరువగా వచ్చి రెండు పరుగుల దూరంలోనే ఆగిపోయింది. సౌతాఫ్రికాతో చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఒక దశలో సులువుగా గెలిచేలా కనిపించిన ఆ టీమ్.. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి కొనితెచ్చుకుంది.
బతికిపోయిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా టీమ్ టీ20 వరల్డ్ కప్ 2024లో ఓ అవమానకర ఓటమి నుంచి తృటిలో బయటపడిందని చెప్పాలి. 116 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన నేపాల్ చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 రన్స్ చేసింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతులకు పరుగు రాలేదు. తర్వాత బంతికి ఫోర్, ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు వచ్చాయి.
దీంతో చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి. కానీ సౌతాఫ్రికా బౌలర్ బార్ట్‌మాన్ తెలివి స్లో షార్ట్ పిచ్ బాల్స్ తో నేపాల్ బ్యాటర్ గుల్సన్ ఝాను బోల్తా కొట్టించాడు. చివరి బంతికి పరుగు తీసి మ్యాచ్ టై చేద్దామని చూసినా.. అతడు రనౌట్ కావడంతో పరుగు తేడాతో సౌతాఫ్రికా గెలిచింది. స్పిన్నర్ షంసి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడంతో నేపాల్ కు ఓటమి తప్పలేదు.
అంతకుముందు చేజింగ్ ను నేపాల్ కాన్ఫిడెంట్ గానే మొదలు పెట్టింది. పరుగులు వేగంగా చేయకపోయినా.. వికెట్లు పడకుండా జాగ్రత్త పడింది. దీంతో 7.2 ఓవర్లలో ఓపెనర్లు తొలి వికెట్ కు 35 పరుగులు జోడించారు. బౌలింగ్ లో 4 వికెట్లతో రాణించిన కుశల్ భుర్తెల్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (42), అనిల్ షా (27) నేపాల్ విజయం వైపు నడిపించేలా కనిపించారు. కానీ చివర్లో కేవలం 6 బంతుల తేడాలో 3 వికెట్లు కోల్పోవడం ఆ టీమ్ కొంప ముంచింది. కీలకమైన సమయంలో షంసి వికెట్లు తీసి సౌతాఫ్రికాను గెలిపించాడు.
కుప్పకూలిన సౌతాఫ్రికా
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా కుప్పకూలింది. కుశల్ భుర్తల్ ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 115 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ మాత్రమే 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కుశల్ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. క్వింటన్ డికాక్ (10), మార్‌క్రమ్ (15), క్లాసెన్ (3), డేవిడ్ మిల్లర్ (7) విఫలమయ్యారు.
చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (27) కాస్త మెరుపులు మెరిపించడంతో సౌతాఫ్రికా ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కుశల్ 4 వికెట్లు తీయగా.. మరో బౌలర్ దీపేంద్ర సింగ్ ఐరీ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్ పై ఈ ఇద్దరూ చెలరేగారు. ఇద్దరూ కలిసి 8 ఓవర్లలో కేవలం 40 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీయడం విశేషం.