USA vs IRE T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్.. అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
USA vs IRE T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024 తొలి రౌండ్లోనే పాకిస్థాన్ ఇంటిదారి పట్టింది. శుక్రవారం (జూన్ 14) అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో యూఎస్ఏ సూపర్ 8 స్టేజ్ కు వెళ్లింది.
USA vs IRE T20 World Cup: వర్షం పాకిస్థాన్ కొంప ముంచింది. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా యూఎస్ఏ, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండా రద్దవడంతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే పాకిస్థాన్ ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్ రద్దవడంతో యూఎస్ఏకు ఒక పాయింట్ లభించింది. దీంతో ఐదు పాయింట్లతో ఆ టీమ్ ఆడిన తొలి టీ20 వరల్డ్ కప్ లోనే సూపర్ 8 స్టేజ్ కు వెళ్లి సంచలనం సృష్టించింది.
పాకిస్థాన్ ఔట్.. సూపర్ 8కు యూఎస్ఏ
టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి రెండు మ్యాచ్ లలో యూఎస్ఏ, ఇండియా చేతుల్లో పాకిస్థాన్ ఓడిన విషయం తెలిసిందే. కెనడాపై గెలిచి, ఐర్లాండ్ తో మ్యాచ్ కు ఆ టీమ్ సిద్ధమవుతోంది. మరోవైపు యూఎస్ఏ అటు పాకిస్థాన్, కెనడాలపై విజయం సాధించి ఇప్పటికే 4 పాయింట్లతో ఉంది. ఐర్లాండ్ తో శుక్రవారం (జూన్ 14) జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఉదయం నుంచి వర్షం కురవపోయినా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ సాధ్యం కాలేదు.
దీంతో ఒక పాయింట్ రావడంతో యూఎస్ఏ టీమ్ పాయింట్ల సంఖ్య 5కి చేరింది. పాకిస్థాన్ తన చివరి మ్యాచ్ లో గెలిచినా గరిష్ఠంగా 4 పాయింట్లే సాధిస్తుంది. అటు టీమిండియా ఇప్పటికే మూడు మ్యాచ్ లలో గెలిచి ఆరు పాయింట్లతో సూపర్ 8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ ఎ నుంచి ఇండియా, యూఎస్ఏ ముందడుగు వేయగా.. పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా ఇంటిదారి పట్టాయి.
పాక్ కొంప ముంచిన వర్షం
పాకిస్థాన్ ఈ మెగా టోర్నీలో యూఎస్ఏ, ఇండియా చేతుల్లో ఓడినా.. కెనడాపై గెలిచి సూపర్ 8 ఆశలను సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం (జూన్ 14) ఐర్లాండ్ చేతుల్లో యూఎస్ఏ ఓడిపోవాలని బలంగా కోరుకుంది. తర్వాత ఆదివారం (జూన్ 16) అదే ఐర్లాండ్ ను ఓడించి సూపర్ 8కు వెళ్లాలని ఆశపడింది. కానీ ఫ్లోరిడాలోని లాండర్‌హిల్ లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు పాకిస్థాన్ కొంప ముంచాయి.
తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడకముందే పాకిస్థాన్ ఇంటికెళ్లిపోవడం ఖాయమైంది. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆ టీమ్.. ఈసారి కనీసం సూపర్ 8 చేరుకోలేకపోయింది. యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్ లోనే ఆ టీమ్ సూపర్ ఓవర్లో ఓడింది. తర్వాత ఇండియా చేతుల్లో ఆరు పరుగులతో పరాజయం పాలైంది. కెనడాపై సులువుగానే గెలిచినా ఫలితం లేకుండా పోయింది.
సూపర్ 8 చేరిన టీమ్స్ ఇవే..
టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికే పలు సూపర్ 8 బెర్తులు ఖాయమయ్యాయి. వాటిలో గ్రూప్ ఎ నుంచి ఇండియా, యూఎస్ఏ.. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా.. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్.. గ్రూప్ డి నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ సూపర్ 8 చేరుకున్నాయి. గ్రూప్ బిలో సూపర్ 8 బెర్తు కోసం ఇంగ్లండ్, స్కాట్లాండ్ పోటీ పడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు సూపర్ 8 చేరుతారన్నది ఆదివారం (జూన్ 16) తేలనుంది.