Sourav Ganguly: టీమిండియాలో బెస్ట్ ఆల్‌రౌండర్ జడేజానే- గంగూలీ కామెంట్స్ వైరల్
01 March 2024, 12:11 IST
Sourav Ganguly: టీమిండియా స్పిన్ త్రయం అశ్విన్, జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్‌పై టీమిండియా దిగ్గజ ఆటగాడు గంగూలీ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఆల్‌రౌండర్‌లలో జడేజా బెస్ట్ అని గంగూలీ చెప్పాడు.
అశ్విన్
Sourav Ganguly: టీమిండియా స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లపై టీమిండియా దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ప్రశంసలు కురిపించాడు. అశ్విన్‌ను ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్ అంటూ ఆకాశానికి ఎత్తాడు గుంగూలీ. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బెస్ట్ ఆల్‌రౌండర్ జడేజా అని గంగూలీ పేర్కొన్నాడు.
500 వికెట్ల తీయడం ఈజీ కాదు...
ఇంగ్లండ్ తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా విజయంతో పాటు ఐదో టెస్ట్‌లో జట్టు కూర్పు గురించి గంగూలీ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. 500 వికెట్లు తీయడం జోక్ కాదని గంగూలీ అన్నాడు. తన ప్రతిభతో అసాధ్యాన్నిఅశ్విన్ సుసాధ్యం చేశాడని గంగూలీ తెలిపాడు. వరల్డ్ వైడ్‌గా ఉన్న గొప్పస్పిన్నర్స్‌లో అశ్విన్ ఒకడు అని గంగూలీ చెప్పాడు.
జడేజా బెస్ట్ ఆల్‌రౌండర్...
ఆల్‌రౌండర్‌గా జడేజా జట్టుకు చక్కగా ఉపయోగపడుతున్నాడని, ఎలాంటి కఠిన పిచ్‌లపైనా బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సత్తా అతడికి జడేజాకు ఉందని గంగూలీ అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలోని బెస్ట్ ఆల్‌రౌండర్స్‌లో జడేజా ఒకడని గంగూలీ చెప్పాడు.
కుల్దీప్ యాదవ్‌పైనా...
అశ్విన్, జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా స్పిన్నర్‌గా ఇంగ్లండ్ సిరీస్‌లో ఆకట్టుకుంటున్నాడని గంగూలీ తెలిపాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో జడేజా, అశ్విన్ ఉన్నా కూడా మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ తన మార్కును చాటుకున్నాడని గంగూలీ పేర్కొన్నాడు ఇంగ్లండ్ సిరీస్ కుల్దీప్ రీఎంట్రీకిచక్కగా ఉపయోగపడిందని అన్నాడు. టీమిండియాకు సుదీర్ఘకాలం పాటు ఆడే సామర్థ్యం, టాలెంట్ కుల్దీప్‌కు ఉన్నాయని గంగూలీ చెప్పాడు.
ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదో టెస్ట్‌లో జడేజా, అశ్విన్, కుల్దీప్ కీలకంగా నిలవబోతున్నారు. ఈ ముగ్గురు కలిసి టీమిడియాకు మరో విజయం అందించడం ఖాయమని గంగూలీ పేర్కొన్నాడు.
ధర్మశాల వేదికగా…
ఐదో టెస్ట్ మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాల వేదికగా జరుగనుంది. అశ్విన్ కెరీర్‌లో ఇది వందో టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. . ఇంగ్లండ్‌తో సిరీస్‌తోనే టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో అశ్విన్ అడుగుపెట్టాడు. కుంబ్లే తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. వరల్డ్ వైడ్‌గా టెస్టుల్లో 500 వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్ అశ్విన్ రికార్డ్ నెలకొల్పాడు. అంతే కాకుండా టీమిండియా తరఫున వంద టెస్ట్‌లు ఆడిన పదమూడో క్రికెటర్‌గా అశ్విన్ నిలవనున్నాడు.
టెస్ట్ సిరీస్ కైవసం
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-1తో ఇప్పటికే టీమిండియా సొంతం చేసుకున్నది. యంగ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్‌ఖాన్, ధ్రువ్ జురేల్ అద్భుత ఆటతీరుతో ఈ సిరీస్‌లో మెరిశారు. ఐదో టెస్ట్‌లో టీమిండియా కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రజత్ పాటిదార్ స్థానంలో జట్టులోకి దేవదత్ పడిక్కల్ రాబోతున్నట్లు సమాచారం.