IND vs BAN 1st Test Live: చెపాక్ టెస్టులో టీమిండియా బ్యాటర్లు టాప్ గేర్.. వన్డే తరహాలో బాదుడు
21 September 2024, 11:10 IST
India vs Bangladesh 1st Test Live Updates: చెపాక్ టెస్టులో భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు నిలిపేందుకు భారత్ జట్టు శనివారం ఆటలో దూకుడు పెంచింది. తొలి సెషన్‌లోనే రిషబ్ పంత్, శుభమన్ గిల్ పోటీ పడుతూ సిక్సర్లు బాదుతున్నారు.
శుభమన్ గిల్, రిషబ్ పంత్
Shubman Gill Chennai Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు దూకుడు పెంచింది. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం 81/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా.. శుభమన్ గిల్ (75 బ్యాటింగ్: 124 బంతుల్లో 6x4, 3x6), రిషబ్ పంత్ (55 బ్యాటింగ్: 91 బంతుల్లో 5x4, 2x6) వన్డే తరహాలో హిట్టింగ్ చేస్తుండటంతో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
శనివారం ఓవర్ నైట్ స్కోరు 33తో బ్యాటింగ్ కొనసాగించిన శుభమన్ గిల్.. తొలి సెషన్ ఆరంభంలోనే రెండు సిక్సర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు. మరోవైపు 12 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో వచ్చిన రిషబ్ పంత్ కూడా పోటీగా రెండు సిక్సర్లు కొట్టడంతో బంగ్లాదేశ్ బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. పేసర్, స్పిన్నర్ అని తేడా చూపకుండా ఈ జోడి భారీ షాట్లు ఆడేస్తోంది.
బంగ్లా ముందు భారీ టార్గెట్?
ఈ క్రమంలో ఇప్పటికే నాలుగో వికెట్‌కి 160 బంతుల్లో 99 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని ఈ ఇద్దరూ నెలకొల్పారు. దాంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లు ముగిసే సమయానికి 166/3తో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టుకి 227 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే. దాంతో ఓవరాల్‌గా 393 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. 450-500 టార్గెట్‌ను బంగ్లాదేశ్ ముందు భారత్ జట్టు నిర్దేశించే అవకాశం ఉంది.
గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకి ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ టీమ్ 149 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియాకి 227 పరుగుల ఆధిక్యం లభించింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ టీమ్‌ను ఫాలో ఆన్ ఆడించని రోహిత్ సేన రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. ఇటీవల బంగ్లాదేశ్‌ను తమ సొంతగడ్డపై ఫాలో ఆన్ ఆడించిన పాకిస్థాన్.. భారీగానే మూల్యం చెల్లించుకుంది. దాంతో భారత్ జట్టు జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది.
పేసర్లకి వికెట్ల పండగ
చెపాక్ పిచ్ సహజసిద్ధంగా స్పిన్‌కి అనుకూలం. కానీ.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి కొత్తగా ఎర్రమట్టితో పిచ్‌ను తయారు చేశారు. దాంతో ఈ వికెట్ మీద అనూహ్యరీతిలో బంతి బౌన్స్, స్వింగ్ అవుతోంది. దెబ్బకి స్పిన్నర్లు చేతులెత్తేయగా.. ఫాస్ట్ బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు.
మ్యాచ్‌లో ఇప్పటికే రెండు రోజుల ఆట ముగియగా.. 23 వికెట్లు పడ్డాయి. ఇందులో 4 వికెట్లు మినహా.. మిగిలిన వికెట్లన్నీ ఫాస్ట్ బౌలర్లు ఖాతాలో వేసుకున్నారు. కానీ శనివారం మాత్రం తొలి సెషన్‌లో బ్యాటర్లకి కాస్త అనుకూలంగా పిచ్ కనిపిస్తోంది. దాంతో రిషబ్ పంత్, శుభమన్ గిల్.. తొలి సెషన్ ఆరంభంలోనే చెరో రెండు సిక్సర్లు అలవోకగా కొట్టగలిగారు.