Sarfaraz Khan Dhruv jurel: అదృష్టమంటే వీళ్లదే.. సర్ఫరాజ్, జురెల్‌లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్.. ఇక డబ్బే డబ్బు
19 March 2024, 7:45 IST
- Sarfaraz Khan Dhruv jurel: టీమిండియా యంగ్ గన్స్ సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ లకు బీసీసీఐ తమ సెంట్రల్ కాంట్రాక్టులు ఇచ్చింది. వీళ్లను గ్రేడ్ సిలో ఉంచడం గమనార్హం.
అదృష్టమంటే వీళ్లదే.. సర్ఫరాజ్, జురెల్‌లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్
Sarfaraz Khan Dhruv jurel: ఈ మధ్యే ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధృవ్ జురెల్ లకు అప్పుడే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. టెస్టు క్రికెటే బెస్ట్.. ఈ ఫార్మాట్ ను గౌరవించిన వాళ్లకే అందలమెక్కిస్తామని ఈ కాంట్రాక్టుల ద్వారా బోర్డు మరోసారి స్పష్టం చేసింది. సోమవారం (మార్చి 18) జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సర్ఫరాజ్, ధృవ్ జురెల్‌లకు కాంట్రాక్టులు
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు దక్కాయంటే జట్టులో ఉన్నా లేకపోయినా ఏడాదికి కొంత మొత్తం ఆ ప్లేయర్స్ కు దక్కుతుంది. తాజాగా ఆ అదృష్టం సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ లను వరించింది. ఈ ఇద్దరికీ గ్రేడ్ సి కాంట్రాక్టులు లభించాయి. దీంతో ఏడాదికి ఒక్కొక్కరికి రూ.కోటి దక్కుతాయి. బోర్డు కాంట్రాక్టు పొందాలంటే ప్రస్తుత సీజన్ లో కనీసం మూడు టెస్టులు ఆడి ఉండాలన్న నిబంధన ఉంది.
ఈ ఇద్దరూ ఇంగ్లండ్ తో మూడేసి టెస్టులు ఆడి ఉండటంతో గ్రేడ్ సి కాంట్రాక్టు ఇచ్చారు. ఇంగ్లండ్ తో సిరీస్ లో సర్ఫరాజ్ తాను ఆడిన మూడు టెస్టుల్లోనూ మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇక రాంచీ టెస్టులో 90, 39 స్కోర్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు ధృవ్ జురెల్. ఈ ఇద్దరికీ పూర్తి అర్హత ఉండంతో బోర్డు కాంట్రాక్టులు అప్పగించింది.
ఆ ఇద్దరినీ పక్కన పెట్టి..
రంజీ ట్రోఫీని కాదని ఐపీఎల్ కు ప్రాధాన్యత ఇస్తున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ల సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలుసు కదా. ఈ ఇద్దరూ బోర్డు చెప్పినా వినకుండా రంజీ ట్రోఫీ మ్యాచ్ లను తేలిగ్గా తీసుకున్నారు. దీంతో వాళ్ల కాంట్రాక్టులను రద్దు చేసి బోర్డు మిగతా ప్లేయర్స్ కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
అంతేకాదు ఏడాదంతా టెస్టు క్రికెట్ ఆడే ప్లేయర్స్ కు బోనస్ కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సర్ఫరాజ్, ధృవ్ జురెల్ లకు సెంట్రల్ కాంట్రాక్టులు ఇచ్చి తమ ఉద్దేశమేంటో బీసీసీఐ చెప్పకనే చెప్పింది. ఎంతటి ప్లేయర్ అయినా టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని మరోసారి బోర్డు స్పష్టంగా చెప్పినట్లయింది.
మరోవైపు రంజీ ట్రోఫీ క్యాలెండర్ లో మార్పులపైనా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచి డిసెంబర్, జనవరి నెలల్లో ఉత్తర భారతంలో ఎలాంటి మ్యాచ్ లు నిర్వహించకూడదన్నది ఆ నిర్ణయం. ఆ సమయంలో అక్కడ పొగ మంచు ఎక్కువగా ఉండటం వల్ల మ్యాచ్ ల నిర్వహణకు సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మధ్యే ముగిసిన రంజీ ట్రోఫీలో ముంబై 42వ సారి ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో విదర్భను చిత్తు చేసి ముంబై రంజీ ట్రోఫీ గెలిచింది.