Sarfaraz Khan father: సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి థార్ కారు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Sarfaraz Khan father: టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేయాలని ఎన్నాళ్లుగానో కలలు కన్న సర్ఫరాజ్ ఖాన్ మొత్తానికి తన కల నెరవేర్చుకున్నాడు. ఈ సందర్భంగా అతని తండ్రి నౌషాద్ ఖాన్ కు ఆనంద్ మహీంద్రా ఓ థార్ కారు ఇస్తానని అనౌన్స్ చేశాడు.
Sarfaraz Khan father: ఇండియాలోని మట్టిలో మాణిక్యాలను ఎప్పుడూ ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా.. తాజాగా సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ అదే చేస్తున్నాడు. మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్ పర్సన్ అయిన ఆయన.. సర్ఫరాజ్ టెస్ట్ అరంగేట్రం చేసిన మరుసటి రోజు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సర్ఫరాజ్ తండ్రికి తాను థార్ కారు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి థార్
ఎన్నో ఏళ్లుగా రంజీ ట్రోఫీలో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తూ టీమిండియా తలుపు తడుతూనే ఉన్న సర్ఫరాజ్ కు నిరాశే ఎదురైంది. అయితే ఇన్నేళ్లుగా తన తనయుడికి అండగా నిలబడి అతనిలో స్ఫూర్తి నింపిన నౌషాద్ కు థార్ కారును గిఫ్ట్ గా ఇవ్వడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడం గమనార్హం.
"హార్డ్ వర్క్, ధైర్యం, సహనం. ఓ కొడుకులో స్ఫూర్తి నింపడానికి ఓ తండ్రికి ఇంతకు మించిన మంచి లక్షణాలు ఇంకేం ఉంటాయి? ఒక స్ఫూర్తిదాయక పేరెంట్ గా నిలిచినందుకు నౌషాద్ ఖాన్ కు థార్ ను గిఫ్ట్ గా ఇవ్వడం నాకు దక్కే గౌరవంగా భావిస్తాను" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనో వీడియో కూడా పోస్ట్ చేశారు.
అందులో సర్ఫరాజ్ ఖాన్ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకోవడంతోపాటు ఈ సందర్భంగా అతని తండ్రి చెప్పిన స్ఫూర్తిదాయక మాటలను వినొచ్చు. సరైన సమయం వచ్చినప్పుడు అవకాశం దానికదే వస్తుంది.. మనం మాత్రం మన ప్రయత్నం వదలకుండా ముందుకు సాగుతూ ఉండాలి అని సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ ఆ వీడియోలో అన్నాడు.
సర్ఫరాజ్ అదిరే అరంగేట్రం
సర్ఫరాజ్ రంజీ ట్రోఫీలో గత మూడు సీజన్లలో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. రెండేళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ మొత్తానికి ఇప్పటికి అవకాశం దక్కింది. మిడిలార్డర్ లో కోహ్లి, అయ్యర్, రాహుల్ లాంటి సీనియర్లు లేకపోవడంతో సర్ఫరాజ్ కు పిలుపు అందింది. సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ పశ్చిమ రైల్వేల్లో ఉద్యోగి.
అంతకుముందు ఆయన అదే రైళ్లలో చిరుతిళ్లు అమ్ముతూ జీవనం సాగించేవారు. తాను ఎన్ని కష్టాలు పడినా కొడుకు సర్ఫరాజ్ కల మాత్రం చెదిరిపోకుండా ఆయన చూసుకున్నారు. చిన్న వయసు నుంచే తండ్రి ప్రోత్సాహం అందుకున్న సర్ఫరాజ్ డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్ లోనే 62 రన్స్ చేశాడు. వచ్చీ రాగానే ధాటిగా ఆడిన సర్ఫరాజ్.. 66 బంతుల్లోనే 62 రన్స్ చేశాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. హార్దిక్ పాండ్యా రికార్డును సమం చేశాడు. తొలి టెస్టు ఆడుతున్నానన్న ఆందోళన అతనిలో కనిపించలేదు. స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు సాధించాడు. అతని ఆటతో మిడిలార్డర్ లో తన స్థానాన్ని సుదీర్ఘ కాలంపాటు ఖాయం చేసుకున్నట్లే కనిపిస్తోంది.