IND vs SA 1st T20: సంజూ శాంసన్ మెరుపు సెంచరీ - తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించిన టీమిండియా
09 November 2024, 5:52 IST
IND vs SA 1st T20: తొలి టీ20లో 61 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది. మెరుపు శతకంతో సంజూ శాంసన్ టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. 50 బాల్స్‌లో ఏడు ఫోర్లు, పది సిక్స్ లతో 107 పరుగులు చేశాడు సంజూ శాంసన్.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫస్ట్ టీ20
IND vs SA 1st T20: సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు చెలరేగడంతో 17.5 ఓవర్లలో 141 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌటైంది. 61 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓటమి పాలైంది.
తొలి ఓవర్‌లోనే వికెట్...
భారీ లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికాను తొలి ఓవర్‌లోనే అర్షదీప్ సింగ్ దెబ్బకొట్టాడు. రెండు ఫోర్లు కొట్టి జోరు మీదున్న కెప్టెన్ మార్‌క్రమ్(8 రన్స్) ను ఔట్ చేశాడు అర్షధీప్. రికెల్టన్, స్టబ్స్ సిక్సర్లు, ఫోర్లతో భయపెట్టిన వారి జోరు ఎక్కువ సేపు కొనసాగలేదు. రికెల్టన్‌ను (21 రన్స్) వరుణ్ చక్రవర్తి, స్టబ్స్‌ను ఆవేశ్‌ఖాన్ పెవిలియన్ పంపించారు. హిట్టర్ క్లాసెన్ 22 బాల్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిల్లర్ నిరాశపరిచాడు.
స్పిన్ దెబ్బకు...
టీమిండియా స్పిన్నర్లు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి దెబ్బకు మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరలో కోయిట్జ్ 11 బాల్స్‌లో మూడు సిక్సర్లతో 23 పరుగులు చేయడంతో సౌతాఫ్రికా ఈ మాత్రమైనా స్కోరు చేసింది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలో మూడు వికెట్లు తీసుకోగా...ఆవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్‌సింగ్‌కు ఓ వికెట్ దక్కింది.
యాభై బాల్స్‌లో సెంచరీ....
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు సెంచరీతో సంజూ శాంసన్ భారీ స్కోరు అందించాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్ లతో 107 రన్స్ చేసిన సంజూ శాంసన్ సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ20ల్లో రెండో సెంచరీ సాధించాడు. సంజూ శాంసన్‌తో పాటు తిలక్ వర్మ 18 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 33 రన్స్ తో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 21 రన్స్ చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు.
పాండ్య, రింకు సింగ్ విఫలం...
ఒకానొక దశలో టీమిండియా ఈజీగా 220కిపైగా పరుగులు చేసేలా కనిపించింది. రింకు సింగ్, పాండ్య, అక్షర్ పటేల్ బ్యాట్ ఝులిపించలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో కోయిట్జ్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. సెంచరీతో టీమిండియాను గెలిపించిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. మొత్తంగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది.