Ind vs SA 1st T20 Live: సంజూ శాంసన్ విశ్వరూపం.. మరో సెంచరీ బాదేశాడు.. టీమిండియా భారీ స్కోరు
Ind vs SA 1st T20 Live: సంజూ శాంసన్ మరోసారి ఎడాపెడా బాదేశాడు. కేవలం 47 బంతుల్లోనే టీ20ల్లో రెండో సెంచరీ చేయడంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. అతనికి తోడు తిలక్ వర్మ కూడా కాస్త రాణించాడు.
Ind vs SA 1st T20 Live: సంజూ శాంసన్ విశ్వరూపం చూపించాడు. ఈ మధ్యే బంగ్లాదేశ్ తో జరిగిన టీ20లో తొలి సెంచరీ చేసిన అతడు.. ఇప్పుడు సౌతాఫ్రికాపై అదే రిపీట్ చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌండరీల వర్షం కురిపించిన సంజూ.. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేయడంతో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోరు చేసింది. తిలక్ వర్మ (33), సూర్యకుమార్ (21) ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు.
సంజూ విశ్వరూపం
సంజూ శాంసన్ సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన అతడు.. రెండో ఓవర్లో మొదలుపెట్టిన ఫోర్లు, సిక్సర్ల హోరు అతడు ఔటయ్యే వరకూ కొనసాగింది. ఈ క్రమంలో అతడు టీ20ల్లో రెండో సెంచరీ సాధించాడు. 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్స్ లతో మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఆ తర్వాత కూడా మరో సిక్స్ బాదిన అతడు.. భారీ స్కోరు చేసేలా కనిపించాడు. అయితే చివరికి 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్ లతో 107 రన్స్ చేసి ఔటయ్యాడు.
సంజూ ఏ సౌతాఫ్రికా బౌలర్ నూ వదల్లేదు. అందరినీ చితకబాదేశాడు. అతడు ఉన్నంతసేపూ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సంజూ శాంసన్ కు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ మంచి సహకారం అందించారు. తిలక్ వర్మ 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 33 రన్స్ చేశాడు. ఇక సూర్య కుమార్ 17 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు.
కట్టడి చేసిన సౌతాఫ్రికా
సంజూ శాంసన్ క్రీజులో ఉన్నంత వరకూ టీమిండియా స్కోరు కనీసం 220 అయినా దాటుతుందని అందరూ భావించారు. కానీ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయిన ఇండియన్ టీమ్.. అంతకంటే చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది. మిడిలార్డర్ లో హార్దిక్ పాండ్యా (2), రింకు సింగ్ (11), అక్షర్ పటేల్ (7) తీవ్రంగా నిరాశ పరిచారు.
ఓపెనర్ అభిషేక్ శర్మ (7) కూడా విఫలమయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ 4 ఓవర్లలో 37 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక మార్కో యాన్సెన్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి వికెట తీశాడు.