RR vs RCB IPL 2024 Eliminator: ఆర్సీబీ దూకుడును ఆర్ఆర్ అడ్డుకుంటుందా? ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ ఈరోజే..
22 May 2024, 10:20 IST
- RR vs RCB IPL 2024 Eliminator: ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ లో ఆర్సీబీ, ఆర్ఆర్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బుధవారం (మే 22) రాత్రి 7.30 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ఆర్సీబీ దూకుడును ఆర్ఆర్ అడ్డుకుంటుందా? ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ ఈరోజే..
RR vs RCB IPL 2024 Eliminator: ఐపీఎల్ 2024లో తొలి క్వాలిఫయర్ ముగిసింది. ఇక ఇప్పుడు ఎలిమినేటర్ జరగనుంది. ఈ మ్యాచ్ బుధవారం (మే 22) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతోంది.
ఈ మ్యాచ్ లో ఓడిన టీమ్ ఇంటిదారి పడుతుంది. గెలిచిన టీమ్ రెండో క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఫైనల్ బెర్తు కోసం తలపడుతుంది. మరి ఆర్సీబీ, ఆర్ఆర్ లలో గెలిచి నిలిచేదెవరు?
ఆర్సీబీ దూకుడును ఆర్ఆర్ తట్టుకుంటుందా?
ఐపీఎల్ 2024లో జరిగిన అతిపెద్ద అద్భుతం ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరడం. ఒక దశలో టేబుల్లో చిట్టచివరి స్థానంలో ఉండి.. ఇక లీగ్ దశలోనే వదిలేసే తొలి జట్టుగా నిలుస్తుందనుకున్న ఆ టీమ్.. వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచి టాప్ 4లోకి చేరింది. అలాంటి టీమ్ తో రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ లో తలపడనుండటం అంత సులువైన విషయం కాదు.
రాయల్స్ మాత్రం తమ చివరి నాలుగు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. చివరి లీగ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఆ టీమ్ గెలుపు ముఖం చూసి చాలా రోజులే అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ హాట్ ఫామ్ లో ఉన్న ఆర్సీబీతో మ్యాచ్ అంటే మాటలు కాదు. పైగా ఇందులో ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సి వస్తుందన్న ఒత్తిడి అదనం. ఇలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్ కు అగ్ని పరీక్షగా ఈ ఎలిమినేటర్ నిలవబోతోంది.
విరాట్ కోహ్లిని అడ్డుకుంటుందా?
ఆర్ఆర్ కు అతిపెద్ద ప్రమాదం ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి నుంచే ఉంది. అతడు ఈ సీజన్లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. లీగ్ స్టేజ్ లోనే 708 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్యాటింగ్ తోపాటు ఫీల్డింగ్ లోనూ మెరుపు వేగంతో కదులుతూ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఫుల్ ఛార్జ్ లో ఉన్న కోహ్లి మొత్తం జట్టునూ అలాగే ఛార్జ్ చేయగల సమర్థుడు. ఈ సీజన్లో అదే జరిగింది.
డూ ఆర్ డైలాంటి చివరి లీగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన తీరు ఆర్సీబీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్ లో కూడా కోహ్లి 29 బంతుల్లో 47 రన్స్ చేశాడు. మంచి దూకుడు మీదున్న కోహ్లిని అడ్డుకోలేకపోతే మాత్రం రాయల్స్ ఈ మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సిందే.
ఆర్ఆర్.. బ్యాటింగ్‌తోనే సమస్య
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ లీగ్ స్టేజ్ తొలి 9 మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడి అద్భుతమైన ఫామ్ లో కనిపించింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది అనుకున్న సమయంలో తర్వాత ఒక్కటి కూడా గెలవలేకపోయింది. వరుసగా నాలుగు ఓడి, ఒకటి రద్దయి అదృష్టవశాత్తూ ప్లేఆఫ్స్ చేరింది. ఆ టీమ్ బ్యాటింగ్ లైనప్ లో నిలకడ లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
స్టార్ ఓపెనర్ బట్లర్ ఇంగ్లండ్ కు వెళ్లిపోవడం, యశస్వి జైస్వాల్ నిలకడగా రాణించకపోవడం ఎలిమినేటర్ కు ముందే రాయల్స్ ను కలవరపెడుతోంది. రియాన్ పరాగ్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. హెట్‌మయర్, ధృవ్ జురెల్ లాంటి వాళ్లు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో ఎలిమినేటర్ లో ఆర్ఆర్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.