Rohit Sharma: రోహిత్ కావాలనే కాయిన్ దూరంగా విసురుతున్నాడు: పాక్ మాజీ క్రికెటర్ వింత వాదన
16 November 2023, 13:40 IST
- Rohit Sharma: రోహిత్ కావాలనే కాయిన్ దూరంగా విసురుతున్నాడు అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికిందర్ భక్త్ వింత వాదన వినిపించాడు. టీమిండియా కెప్టెన్ టాస్ వేసే తీరుపైనా అతడు సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.
న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ వేస్తున్న రోహిత్ శర్మ
Rohit Sharma: వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్లడం చూసి కొందరు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకు నిద్ర పట్టడం లేదు. ఏవేవో వింత వాదనలు వినిపిస్తూ తమ పరువు తీసుకుంటున్నారు. తాజాగా మరో మాజీ క్రికెటర్ సికిందర్ భక్త్ అయితే రోహిత్ శర్మ టాస్ వేసే విధానంపై సందేహం వ్యక్తం చేశాడు. అతడు కావాలనే కాయిన్ దూరంగా విసురుతున్నాడని సికిందర్ అన్నాడు.
టీమిండియాకు వేరే బాల్స్ ఇస్తున్నారని, డీఆర్ఎస్ నూ తారుమారు చేస్తున్నారని ఆ మధ్య పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా చేసిన కామెంట్స్ అతన్ని నవ్వుల పాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సికిందర్ భక్త్ అయితే మరో అడుగు ముందుకేసి అసలు రోహిత్ శర్మ టాస్ విషయంలోనే సందేహం వ్యక్తం చేశాడు. ఇతర కెప్టెన్లకు టాస్ లో ఏం పడిందో కనిపించకుండా కాయిన్ దూరంగా విసురుతున్నాడని అతడు ఆరోపించడం గమనార్హం.
పాకిస్థాన్ లోని జియో న్యూస్ టీవీ చర్చలో సికిందర్ ఈ కామెంట్స్ చేశాడు. "నేను ఒక కుట్ర సిద్ధాంతాన్ని చెప్పాలా? ఓ ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ టాస్ వేసే విధానాన్ని ఒకసారి చూపిస్తారా? రోహిత్ టాస్ వేసినప్పుడు దూరంగా విసురుతాడు. అప్పుడు మరో కెప్టెన్ అక్కడికి వెళ్లి ఏం పడిందో చూడలేరు కదా" అని అతడు అన్నాడు.
తర్వాత రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ లోనూ టాస్ వేసిన తీరును చూపించారు. అన్ని మ్యాచ్ లలోనూ రోహిత్ ఎందుకిలా కాయిన్ దూరంగా వేస్తున్నాడు? ఇతర కెప్టెన్లు అలా చేయడం నేను చూడలేదు. దీని వెనుక ఏదైనా కారణం ఉందా? అనే క్యాప్షన్ తో ఈ వీడియోను సికిందర్ భక్త్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడం విశేషం.
రోహిత్ శర్మ కావాలనే కాయిన్ దూరంగా విసిరి.. అవతలి కెప్టెన్ కు తెలియకుండా చేసి టాస్ గెలుస్తున్నాడని పరోక్షంగా అతడు చెప్పే ప్రయత్నం చేశాడు. క్రికెట్ లో టాస్ చాలా కీలకం. అందులోనూ జరుగుతున్నది ఐసీసీ టోర్నీ. ఐసీసీ నియమించిన మ్యాచ్ రిఫరీయే కాయిన్ లో హెడ్స్ పడిందా, టెయిల్స్ పడిందా చెబుతాడు. అలాంటి టాస్ పై కూడా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సందేహం వ్యక్తం చేయడం చూస్తుంటే.. టీమిండియా ఆధిపత్యాన్ని వాళ్లు అసలు భరించలేకపోతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.