Pitch Controversy: పిచ్చి మాటలు వద్దు.. నోరు మూసుకోండి: పిచ్‌పై ఏడుస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లకు గవాస్కర్ వార్నింగ్
Pitch Controversy: వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో పిచ్ మార్పుపై కామెంట్స్ చేస్తున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. పిచ్చి మాటలు వద్దు.. నోరు మూసుకోండి అని తీవ్రంగా మండిపడ్డాడు.
Pitch Controversy: వరల్డ్ కప్ 2023లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్లో పిచ్ చుట్టూ కుట్ర సిద్ధాంతాలు లేవనెత్తుతున్న వాళ్లందరికీ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు. ఇండియా స్పిన్నర్లకు అనుకూలించేలా చివరి నిమిషంలో పిచ్ మార్చారన్న విమర్శలపై మ్యాచ్ తర్వాత సన్నీ స్పందించాడు.
ముంబై క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ సెమీఫైనల్ ప్రారంభానికి ముందు పిచ్ మార్చారని, అది ఇండియన్ స్పిన్నర్లకు అనుకూలించేలా ఇప్పటికే ఉపయోగించిన పిచ్ అని విమర్శలు వచ్చాయి. నిజానికి దీనిపై ఐసీసీ కూడా స్పష్టత ఇచ్చినా విమర్శలు మాత్రం ఆగలేదు. చివరికి ఈ పిచ్ పై 700కుపైగా స్కోరు నమోదు కావడం, పేసర్లకే ఎక్కువ వికెట్లు రావడంతో విమర్శకుల నోళ్లు మూత పడ్డాయి.
అయితే ఈ విమర్శలపై మ్యాచ్ తర్వాత గవాస్కర్ సీరియస్ గా స్పందించాడు. "ఏ పెద్ద టోర్నమెంట్లో అయినా ఇండియా ఫైనల్ చేరినా గర్వంగా అనిపిస్తుంది. అందులోనూ వరల్డ్ కప్ అయితే అది మరింత స్పెషల్. ఇండియా ఆ పనిని తనదైన స్టైల్లో చేసింది. వాళ్లు 400 వరకూ రన్స్ చేశారు. పిచ్ చాలా బాగుంది. దీనిపై 700కుపైగా స్కోర్లు నమోదయ్యాయి.
ఇండియన్ స్పిన్నర్ల కోసం పిచ్ ను మార్చారని ఏడుస్తున్న ఆ మూర్ఖులందరూ నోరు మూసుకోండి. ఇండియాపై విమర్శలు చేయడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు. ఇదంతా పిచ్చి వాగుడు. ఒకవేళ మార్చినా అది టాస్ కంటే ముందే మార్చారు. అది టాస్ తర్వాతో లేక ఇన్నింగ్స్ మధ్యలో మార్చలేదు. వరల్డ్ కప్ టీమ్ గా ఆ పిచ్ పై ఆడి గెలవాలి. ఇండియా అదే చేసింది. అందుకే పిచ్ గురించి మాట్లాడటం ఆపండి" అని మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ లో గవాస్కర్ చాలా తీవ్రంగా స్పందించాడు.
ఆ సమయంలో పక్కనే ఉన్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ కూడా గవాస్కర్ కామెంట్స్ తో ఏకీభవిస్తున్నట్లు నవ్వుతూ తలాడించాడు. ఫైనల్ జరిగే అహ్మదాబాద్ పిచ్ కూడా మార్చారన్న విమర్శలపైనా గవాస్కర్ స్పందించాడు. "రెండో సెమీఫైనల్ కూడా కానే లేదు అప్పుడే అహ్మదాబాద్ పిచ్ మార్చారని కూడా వాళ్లు విమర్శిస్తున్నారు" అని గవాస్కర్ ఈ సందర్భంగా చెప్పాడు.
నిజానికి పిచ్ మార్పుపై ఐసీసీ కూడా స్పందించింది. పిచ్ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్ కు చెప్పే పిచ్ మార్చారని స్పష్టం చేసింది. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో చివరికి వచ్చే సమయానికి పిచ్ మార్పులు సహజమేనని, ఇంతకు ముందు కూడా ఇలా జరిగిందని ఐసీసీ చెప్పింది. సదరు వేదిక క్యూరేటర్ సిఫారసు మేరకు, ఆతిథ్య బోర్డు అనుమతితో ఈ పని చేసినట్లు తెలిపింది.
పిచ్ మార్పుపై పలువురు పాకిస్థాన్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లు తాజా పిచ్ లపై ఆడాలని, ఇది సింపుల్ రూల్ అని ఇంగ్లండ్ మాజీ మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు.