IND vs NZ: భళా భారత్ .. సూపర్ షమీ.. సెమీస్‍లో న్యూజిలాండ్‍పై విజయం.. ఫైనల్‍కు టీమిండియా
IND vs NZ Cricket World Cup 2023 Semi Final: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍కు టీమిండియా చేరింది. నేడు జరిగిన సెమీఫైనల్‍లో న్యూజిలాండ్‍ను భారత్ చిత్తుచేసింది. వరల్డ్ తుదిపోరులో అజేయంగా అడుగుపెట్టింది. టైటిల్‍కు ఒక అడుగుదూరంలో ఉంది.
IND vs NZ Cricket World Cup 2023 Semi Final: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భారత్ జైత్రయాత్ర కొనసాగింది. సెమీఫైనల్‍లో న్యూజిలాండ్‍ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా ఫైనల్‍లో అడుగుపెట్టింది. వరల్డ్ కప్ టైటిల్‍కు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఈ ప్రపంచకప్‍లో వరుసగా పదో గెలుపు నమోదు చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేడు (నవంబర్ 15) జరిగిన తొలి సెమీఫైనల్‍లో టీమిండియా 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీసుకొని సత్తాచాటాడు. కివీస్ బ్యాటింగ్ లైనప్‍ను కుప్పకూల్చాడు. ఓ వన్డే మ్యాచ్‍లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (7/57) రికార్డును కైవసం చేసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‍లో సత్తాచాటిన టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ చేరింది. 2019 పరాభవానికి న్యూజిలాండ్‍పై ప్రతీకారాన్ని కూడా భారత్ తీర్చుకుంది. వివరాలివే..
ఈ సెమీస్ మ్యాచ్‍లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (117), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో సత్తాచాటగా.. శుభ్‍మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్) అదరగొట్టాడు. దీంతో భారత్‍కు భారీ స్కోరు దక్కింది. కివీస్ బౌలర్లలో సౌథీ మూడు వికెట్లు తీశాడు.
భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్ (134) అద్భుత పోరాటంతో సెంచరీ చేశాడు. అయితే, కేన్ విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) మినహా ఇతర కివీస్ బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత పేసర్ మహమ్మద్ షమీ ఏడు వికెట్లతో అద్భుత బౌలింగ్ చేయగా.. జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‍కు చెరో వికెట్ దక్కింది.
ఈ గెలుపుతో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరింది భారత్. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ తుదిపోరుకు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రేపు (నవంబర్ 16) కోల్‍కతా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఆ మ్యాచ్‍లో గెలిచే జట్టుతో ఫైనల్‍లో టైటిల్ కోసం భారత్ తలపడనుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది.
మొత్తంగా ప్రపంచకప్ టైటిల్‍కు ఒక్క అడుగుదూరంలో భారత్ ఉంది. 2011లోనూ సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరగగా.. భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే జరుగుతుందని టీమిండియా అభిమానులు కోటి ఆశలతో నమ్మకంగా ఉన్నారు.
కాసేపు టెన్షన్ పెట్టిన మిచెల్, కేన్
భారత పేసర్ మహమ్మద్ షమీ.. డెవోన్ కాన్వే (13), రచిన్ రవీంద్ర(13)ను ఔట్ చేయడంతో 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది న్యూజిలాండ్. అయితే, ఆ తర్వాత డారెల్ మిచెల్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ అదరగొట్టారు. మూడో వికెట్‍కు ఏకంగా 181 పరుగులు జోడించారు. నిదానంగా మొదలు పెట్టి దూకుడుగా ఆడారు. టీమిండియాను టెన్షన్ పెట్టారు. మిచెల్ శతకంతో సత్తాచాటాడు. విలియమన్స్ ఇచ్చిన క్యాచ్‍ను షమీ వదిలేశాడు. మొత్తంగా టీమిండియా కాసేపు టెన్షన్ పడింది. అయితే, మహమ్మద్ షమీ బౌలింగ్‍కు వచ్చి 33వ ఓవర్లో విలియమ్సన్‍ను ఔట్ చేసి మ్యాచ్‍ను మలుపుతిప్పాడు. అదే ఓవర్లో టామ్ లాథమ్‍ను కూడా షమీ పెవిలియన్‍కు పంపాడు. ఆ తర్వాత టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తూ గెలిచింది. షమీ ఏకంగా ఏడు వికెట్లు తీసుకున్నాడు.
ఇక, ఈ మ్యాచ్‍లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 50వ వన్డే శతకానికి చేరి చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ (49 వన్డే శతకాలు) అత్యధిక వన్డే శతకాల రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‍లో 50 శతకాలు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
సంబంధిత కథనం