Rohit Sharma record: సెహ్వాగ్ రికార్డుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ.. న్యూజిలాండ్ సిరీస్‌లోనే..
15 October 2024, 15:58 IST
- Rohit Sharma record: వీరేందర్ సెహ్వాగ్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లోనే ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
సెహ్వాగ్ రికార్డుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ.. న్యూజిలాండ్ సిరీస్‌లోనే..
Rohit Sharma record: న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు బ్రేక్ చేయడానికి చేరువవుతున్నాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. అది ఇండియా తరఫున టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్స్ ల రికార్డు కావడం విశేషం. మరో నాలుగు సిక్స్ లు కొడితే రికార్డు బ్రేకవుతుంది.
సెహ్వాగ్ రికార్డుకు చేరువలో రోహిత్
న్యూజిలాండ్ తో టీమిండియా మూడు టెస్టుల సిరీస్ కు సిద్ధమైంది. బుధవారం (అక్టోబర్ 16) నుంచే ఈ సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులో తొలి టెస్టు జరగనుంది. బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఇండియన్ టీమ్ బరిలోకి దిగుతోంది. అయితే ఈ సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరవయ్యాడు.
టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్స్ ల రికార్డు. ఇండియా తరఫున టెస్టుల్లో 90 సిక్స్ లతో వీరేంద్ర సెహ్వాగ్ తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 87 సిక్స్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో మూడు సిక్స్ లు బాదితే వీరూతో సమం కానుండగా.. నాలుగు బాదితే అతన్ని అధిగమిస్తాడు. మూడు టెస్టుల సిరీస్ లో రోహిత్ కు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు.
సెహ్వాగ్, రోహిత్ శర్మ తర్వాత ఎమ్మెస్ ధోనీ 78, సచిన్ టెండూల్కర్ 69, రవీంద్ర జడేజా 66 సిక్సర్లు బాదారు. ఇక ఇదే సిరీస్ లో ఆడుతున్న జడేజా కూడా తనపై స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ సిక్స్ ల రికార్డుపై కన్నేశాడు. ఇక వీళ్ల తర్వాత రిషబ్ పంత్ 59, కపిల్ దేవ్ 61 సిక్స్ లు కొట్టారు. పంత్ ఈ సిరీస్ ఆడుతుండటంతో కపిల్ రికార్డును అతడు బ్రేక్ చేసే అవకాశం ఉంది.
అత్యధిక సిక్స్‌ల వీరుడు
రోహిత్ శర్మ పేరిట ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్స్ ల రికార్డు ఉంది. అతడు మూడు ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్ లో 623 సిక్సర్లు బాదాడు. అతని తర్వాత వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ 553 సిక్స్ లతో ఉన్నాడు. ఇక జోస్ బట్లర్ 340 సిక్స్ లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్ లో 87 సిక్స్ లతో ఏంజెలో మాథ్యూస్, క్రిస్ కెయిన్స్ లతో సమంగా ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్ ల రికార్డు బెన్ స్టోక్స్ పేరిట ఉంది. అతడు 131 సిక్స్ లు బాదడం విశేషం. ఇక టెస్టుల్లో మెకల్లమ్, గిల్‌క్రిస్ట్ కూడా 100కుపైగా సిక్స్ లు కొట్టారు.