R Ashwin Retirement reason: టీమిండియాకి నా అవసరం లేకపోతే.. గుడ్ బై చెప్పడమే మంచిది.. వీడ్కోలుకి ముందు రోహిత్‌తో అశ్విన్
18 December 2024, 14:28 IST
R Ashwin Retirement: భారత్ పిచ్‌లపై టెస్టుల్లో తిరుగులేని స్పిన్నర్‌గా పేరొందిన అశ్విన్‌కి.. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కడం లేదు. దాంతో 38 ఏళ్ల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అయితే.. విషయాన్ని ముందే రోహిత్ శర్మకి చెప్పాడట.
అశ్విన్ రిటైర్మెంట్
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కి బుధవారం గుడ్ బై చెప్పేశాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా ఈరోజు మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ముగిసిన నిమిషాల వ్యవధిలోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి అశ్విన్ వీడ్కోలు పలికాడు.
ఆస్ట్రేలియా గడ్డపై ప్రస్తుతం బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆడుతుండగా.. ఐదు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. నాలుగో టెస్టు మ్యాచ్ డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభంకానుండగా.. ఆఖరి టెస్టుకి జనవరి 3 నుంచి సిడ్నీ ఆతిథ్యం ఇవ్వనుంది.
అడిలైడ్‌లో ఛాన్స్ ఇచ్చినా ఫెయిల్
వాస్తవానికి గబ్బా టెస్టులో అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులోనూ అశ్విన్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే.. అడిలైడ్‌లో పింక్ బాల్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో మాత్రం అశ్విన్‌కి ఛాన్స్ దక్కినా.. అతను ఆశించిన మేర వికెట్లు రాబట్టలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పిచ్‌లపై స్పిన్నర్ల ప్రభావం పెద్దగా లేకపోవడంతో.. మిగిలిన రెండు టెస్టుల్లోనూ అశ్విన్‌ను ఆడించే సంకేతాలు కనిపించలేదు. దాంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్టులో అశ్విన్‌కి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడంతో అప్పుడే రిటైర్మెంట్‌పై అశ్విన్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయాన్ని అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు.
అశ్విన్‌కి అన్నీ తెలుసు
‘‘అశ్విన్ చాలా కష్టపడి టీమ్‌లో ఈ స్థాయికి ఎదిగాడు. కాబట్టి.. తుది జట్టులో అతనికి చోటు ఇవ్వలేకపోవడంపై మేము సమాధానం చెప్పాల్సిందే. పిచ్, ప్రత్యర్థి జట్టుకి తగినట్లుగా టీమ్ కాంబినేషన్ ఎంపిక గురించి జట్టు మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తుందో అశ్విన్‌కి తెలుసు. కానీ.. ఏ స్పిన్నర్‌ని ఆడించాలో ఆస్ట్రేలియా పిచ్‌లపై మేము ముందే నిర్ణయించుకోలేని పరిస్థితి. దాంతో పెర్త్ టెస్టు టైమ్‌లో అతడ్ని ఒప్పించి.. అడిలైడ్ టెస్టు వరకూ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆపి ఆడించాం’’ అని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు.
టీమ్‌కి ఉపయోగం లేనప్పుడు ఎందుకు?
అశ్విన్ రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘భారత్ జట్టుకి ఈ సిరీస్‌లో నా అవసరం లేకపోతే.. నేను ఆటకి రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని అశ్విన్ ముందే చెప్పాడు. నిజమే..మెల్‌బోర్న్‌లో పిచ్, పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే ఓ అంచనాకి రాలేని పరిస్థితి. అశ్విన్ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అతను పెద్ద మ్యాచ్ విన్నర్. రిటైర్మెంట్ అనేది పూర్తిగా అతని సొంత నిర్ణయం. అశ్విన్ చాలా చమత్కారమైన మనిషి. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని చెప్పుకొచ్చాడు.
భారత్ తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లను అశ్విన్ ఆడాడు. 2022 నుంచి టీ20లకి, 2023 నుంచి వన్డేలకి దూరమైన అశ్విన్.. గత కొంతకాలంగా కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు వరుసగా టెస్టు టీమ్ నుంచి కూడా పక్కకి తప్పించడంతో ఈ 38 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ ఇంటర్నేషన్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు.