Rohit Sharma: ఆస్ట్రేలియా టూర్‌లో తన తప్పుని ఒప్పుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. నన్ను ఇబ్బందుల్లోకి నెట్టొద్దండి ప్లీజ్
18 December 2024, 19:26 IST
Rohit Sharma: అశ్విన్‌తో పాటు పుజారా, రహానెని రిటైర్మెంట్ ఆటగాళ్లతో జతచేసిన రోహిత్ శర్మ.. స్పీచ్ మధ్యలో గుర్తొచ్చి తప్పిదాన్ని దిద్దుకున్నాడు. అలానే తన బ్యాటింగ్ వైఫల్యాలను అంగీకరించాడు.
రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా టూర్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా.. రోహిత్ శర్మ చేసిన అత్యధిక స్కోరు 10 పరుగులు మాత్రమే. దాంతో రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమం అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
3 ఇన్నింగ్స్‌ల్లో 19 పరుగుల
రోహిత్ శర్మ భార్య రితిక ఇటీవల రెండో బిడ్డకి జన్మనివ్వడంతో.. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత అడిలైడ్‌లో జరిగిన డే/నైట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 3, 6 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. బుధవారం గబ్బాలో డ్రాగా ముగిసిన మూడో టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసి ఔటయ్యాడు.
వాస్తవానికి ఈ ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఆడటం లేదు. కేఎల్ రాహుల్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి.. నెం.6లో ఆడుతున్నాడు. దాంతో రోహిత్ శర్మ సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఆ ప్రభావం అతని స్కోర్లలో కనిపిస్తోంది.
బ్యాటింగ్ చేయలేకపోతున్నా
గబ్బా టెస్టు తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘నేను బాగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాను. దాన్ని అంగీకరించడం వల్ల నష్టమేమీ లేదు. కానీ నేను ఎలా మ్యాచ్‌ల కోసం ప్రిపేర్ అవుతున్నానో నాకు తెలుసు. నెట్స్‌లో శ్రమిస్తున్నాను. కానీ క్రీజులో ఎక్కువ సేపు ఉండాల్సింది. అయితే ఆ పనిని నేను చేయలేకపోతున్నాను. సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లో ఆ పని చేస్తాను’’ అని ధీమా వ్యక్తం చేశాడు.
గత ఆస్ట్రేలియా పర్యటనలో హీరోలుగా నిలిచిన అజింక్య రహానె, చతేశ్వర్ పుజారా ఇప్పుడు జట్టులో లేరు. ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నారు. ఈరోజు స్పిన్నర్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. దాంతో సుదీర్ఘకాలం మీతో ఆడిన సహచరులు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా జట్టు నుంచి వెళ్లిపోవడం మీకు ఏమి అనిపిస్తోంది? అని రోహిత్ శర్మను జర్నలిస్ట్ అడగ్గా.. హిట్ మ్యాన్ సమాధానమిచ్చాడు.
రహానెకి కలుస్తా.. కానీ పుజారా?
‘‘నిజమే.. మేము చాలా కాలం కలిసి ఆడాం. అజింక్య రహానె ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నాడు. కాబట్టి నేను అతన్ని కలుస్తూనే ఉన్నాను. పుజారా రాజ్ కోట్ ఉన్నాడు కాబట్టి అతడ్ని కలిసే అవకాశం తక్కువ. ఇక అశ్విన్ అంటారా.. అతడ్నీ ఇకపై కలుస్తూనే ఉంటాను. అయినా.. రహానె, పుజారా రిటైర్ కాలేదు కదా? వాళ్లు మళ్లీ తిరిగి జట్టులోకి రావొచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దండి ప్లీజ్’’ అని రోహిత్ శర్మ సరదాగా సూచించాడు. అశ్విన్‌తో పాటు రహానె, పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించినట్లు భావిస్తూ తొలుత రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అసలు విషయం గుర్తొచ్చి.. తప్పిదాన్ని దిద్దుకున్నాడు.