Rohit Sharma: కోహ్లి బాటలోనే రోహిత్...టీ20లకు గుడ్‌బై చెప్పిన టీమిండియా కెప్టెన్!
30 June 2024, 6:03 IST
టీ20లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి గుడ్‌బై చెప్పారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా విజయం సాధించిన అనంతరం కోహ్లి, రోహిత్ టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించారు.
విరాట్ కోహ్లి, ద్రావిడ్, రోహిత్ శర్మ
టీ20 క్రికెట్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్ టైటిల్ గెలిచి ఘనంగా పొట్టి ఫార్మెట్‌కు వీడ్కోలు పలికారు. శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాను టీమిండియా చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో టీమిండియా విజయాన్ని సాధించింది.
ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత తమ రిటైర్‌మెంట్‌పై కోహ్లి, రోహిత్ వేర్వేరుగా ప్రకటనలు చేశారు. టీ20 వరల్డ్ లీగ్ దశతో పాటు సూపర్8, సెమీస్‌లో దారుణంగా విఫలమైన కోహ్లి ఫైనల్‌లో అదరగొట్టాడు. 23 పరుగులుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ జట్టును హాఫ్ సెంచరీతో (59 బాల్స్‌లో 76 రన్స్)తో ఆదుకున్నాడు. ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకొని ఇంటర్నేషనల్ టీ20లకు బైబై చెప్పాడు కోహ్లి.
ఓడిపోయిన కూడా...
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకునే సమయంలోనే రిటైర్‌మెంట్‌ను ప్రకటించి షాకిచ్చాడు. “ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్. మేం కప్ సాధించాలని అనుకున్నాం. సాధించాం. గత మ్యాచుల్లో విఫలమైన కీలక సమయంలో రాణించడం ఆనందంగా ఉంది. ఒకవేళ ఫైనల్లో మేము ఓడిపోయిన రిటైర్‌మెంట్ ప్రకటించేవాడిని.తర్వాతి తరం బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం ఇది. కొందరు అద్భుతమైన ఆటగాళ్లు జట్టును ముందుకు తీసుకెళతారని నమ్ముతున్నా” అని విరాట్ కోహ్లి చెప్పాడు.
ఇదే చివరి మ్యాచ్...
ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా తరఫున తన చివరి టీ20 మ్యాచ్ అని రోహిత్ శర్మ చెప్పాడు. ఈ ఫార్మెట్‌కు వీడ్కోలు చెప్పేందుకు ఇంతకుమించిన మంచి సమయం లేదు. టీ20 కెరీర్‌లోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశా. వరల్డ్ కప్ గెలవాలని అనుకున్నాను. గెలిచాను అని రోహిత్ శర్మ అన్నాడు.
టీమిండియా తరఫున టీ20 క్రికెట్‌లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ4231 పరుగులు చేశాడు. టీ20 ఫార్మెట్‌లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేశాడు. ఈ పొట్టి క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. బౌలింగ్‌లోనూ ఓ వికెట్ తీసుకున్నాడు.
ఒక సెంచరీ...
మరోవైపు టీ20 ఫార్మెట్‌లో 125 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 4188 రన్స్ చేశాడు. ఒక సెంచరీతోపాటు 38 హాఫ్ సెంచరీలు చేశాడు. బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
కోహ్లి, రోహిత్ శర్మలతో పాటు కోచ్‌గా ద్రావిడ్‌కు టీమిండియా తరఫున ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. ద్రావిడ్ కూడా వరల్డ్ కప్ టైటిల్ గెలిచి కోచ్ పదవికి గుడ్‌బై చెప్పాడు.